యాదగిరిగుట్ట, వెలుగు: ఏపీలోని గుంటూరు నుంచి సిద్దిపేటకు తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన దొండపాటి మల్లికార్జునరావు, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన శంకర్ కలిసి కొంతకాలంగా సిద్దిపేటకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న తుర్కపల్లి పోలీసులు, వ్యవసాయాధికారులు కలిసి మంగళవారం తుర్కపల్లిలో తనిఖీలు చేయగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జునరావు కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసి రూ.10 లక్షల విలువైన 150 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ శంకర్, ఎస్సై తక్యుద్దీన్ ను డీఎస్పీ అభినందించారు.
