హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్..ఫేక్ నంబర్ ప్లేట్లు ఉంటే క్రిమినల్ జైలుకే.!

హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్..ఫేక్ నంబర్ ప్లేట్లు ఉంటే క్రిమినల్ జైలుకే.!

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్. నకిలీ అనధికారిక వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లతో రోడ్లపై తిరిగితే ఇక జైలుకే. నగరంలో ఫేక్ నంబర్ ప్లేట్లే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ తనిఖీలను తీవ్రతరం చేశారు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. గత వారం రోజుల్లోనే పోలీసులు 10 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

మెహదీపట్నం, మహంకాళి, టోలిచౌకి, గుడిమల్కాపూర్, అంబర్‌పేట్, ఛత్రినాక, సంతోష్ నగర్, సనత్‌నగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. తమ అసలు గుర్తింపును దాచిపెట్టి, ట్రాఫిక్ రూల్స్ , చలానాల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాలకు పాల్పడితే.. వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ఇటీవలే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగి ఆపరేషన్ కవచ్ పేరుతో తనిఖీలు చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఏకంగా 2,149 వాహనాలను సీజ్ చేశారు.నంబర్ ప్లేట్లను మార్చడం వల్ల నేరస్థులు సులభంగా తప్పించుకోవడమే కాకుండా.. అమాయక పౌరుల పేరిట తప్పుడు ఈ-చలానాలు, లీగల్ కేసులు నమోదవుతున్నాయి. ఇది శాంతిభద్రతలకు పెద్ద సవాల్‌గా మారింది అని సీపీ స్పష్టం చేశారు.

అందుకే నగరవాసులంతా రవాణా శాఖ ఆమోదించిన అధికారిక నంబర్ ప్లేట్లను మాత్రమే వాడాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.