బడి గడప తొక్కని హెచ్‌‌‌‌ఎం!..పైగా ఆయనే ఇంగ్లీష్ టీచర్. అగమ్యగోచరంగా విట్యాల విద్యార్థుల భవిష్యత్తు

 బడి గడప తొక్కని హెచ్‌‌‌‌ఎం!..పైగా ఆయనే  ఇంగ్లీష్ టీచర్. అగమ్యగోచరంగా విట్యాల విద్యార్థుల భవిష్యత్తు
  • అగమ్యగోచరంగా విట్యాల విద్యార్థుల భవిష్యత్తు 
  • పైగా ఆయనే ఇంగ్లీష్ టీచర్.. 
  • పది పరీక్షల్లో తప్పితేమా పరిస్థితి ఏంటని విద్యార్థుల ఆందోళన 

షాద్​నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తీరు చర్చనీయాంశంగా మారింది. పాఠశాలకు రవి అనే వ్యక్తి హెడ్ మాస్టర్, పైగా ఆయనే ఇంగ్లీష్ టీచర్. కానీ, ఆయన దర్శనం విద్యార్థులకు అమావాస్యకో పున్నానికో అన్నట్లుగా మారింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేసేందుకు వచ్చిన సార్.. మళ్లీ ఇప్పటివరకు పాఠశాల గడప తొక్కలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్  బోధించే వారు లేక వారి చదువులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

మా జీవితాలు ఆగమైపోతాయ్​

మరో కొన్నిరోజుల్లో వార్షిక పరీక్షలు ఉన్న తరుణంలో సిలబస్ పూర్తి చేయాల్సింది పోయి, ఏదో పని ఉంది అంటూ కాలక్షేపం చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫెయిల్ అయితే తమ జీవితాలు ఆగమైపోతాయని, తమ బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారు? అంటూ పదో తరగతి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హెచ్‌‌‌‌ఎంపై నిరసిస్తూ మంగళవారం విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి, నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లారు.

సర్పంచ్ ఈ విషయంపై ఎంఈఓ కి ఫోన్ చేయగా, మీ ప్రిన్సిపాల్​కు వేరే పని ఉంది.. 12వ తేదీ తర్వాత వస్తారని సమాధానం ఇవ్వడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పనులు ఉంటే తమకు పాఠాలు చెప్పేందుకు ఇంకో టీచర్​ను పంపాలని డిమాండ్ చేస్తున్నారు.