ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తీసేసాక పాలసీదారులకు పెరిగిన కష్టాలు.. సర్వేలో బయటపడ్డ వాస్తవాలు

ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తీసేసాక పాలసీదారులకు పెరిగిన కష్టాలు.. సర్వేలో బయటపడ్డ వాస్తవాలు

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు.. సామాన్యులు తమపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. పన్నుల భారం పోయినా.. ప్రీమియంల మోత, క్లెయిమ్‌ల తిరస్కరణలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంలో తీవ్ర జాప్యం వంటి సమస్యలు పాలసీదారులను వేధిస్తున్నాయని తేలింది.

దేశంలోని 323 జిల్లాల్లో 54వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వే విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. గత మూడేళ్లలో ప్రతి 10 మందిలో 7 పాలసీదారుల ప్రీమియం 50 నుంచి 200 శాతం వరకు పెరిగింది. మరీ ముఖ్యంగా.. 20 శాతం మంది బాధితులకు ప్రీమియం ధర ఏకంగా 300% పెరగడం గమనార్హం. వైద్య ద్రవ్యోల్బణం, క్లెయిమ్ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని IRDAI చెబుతున్నప్పటికీ, సామాన్యుడిపై మాత్రం ఇది తీరని భారంగా మారింది.

ప్రీమియంలు భారీగా కడుతున్నా.. అవసరమైనప్పుడు క్లెయిమ్ రావడం లేదని సర్వేలో కుండ బద్ధలు కొట్టి చెప్పేశారు పాలసీహోల్డర్లు. 2023-2025 మధ్య క్లెయిమ్ ఫైల్ చేసిన వారిలో కేవలం 32 శాతం మందికి మాత్రమే ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి నగదు అందిందట. సుమారు 44 శాతం మంది పాలసీదారులు తమ క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలు అకారణంగా తిరస్కరించాయని.. కొన్ని సందర్భాల్లో తమకు పాక్షికంగానే చెల్లించాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీలపై ఫిర్యాదులు 41 శాతం పెరగడం ఈ దుస్థితికి అద్దం పడుతోంది.

డిశ్చార్జ్ సమయంలో క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌లను 3 గంటల్లోగా పూర్తి చేయాలని నిబంధన ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీల అనుమతి కోసం రోగులు 6 నుంచి 48 గంటల పాటు ఆసుపత్రిలోనే వేచి చూడాల్సి వస్తోందట. దాదాపు 50 శాతం మంది పాలసీదారులు ఈ తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొన్నారని సర్వేలో తేలింది. రూల్స్ బేఖాతరు చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలు సాగిస్తున్న ఈ తీరుపై సర్వే నివేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

వృద్ధులు, సీనియర్ సిటిజన్ల కోసం వార్షిక ప్రీమియం పెరుగుదలపై 10 శాతం పరిమితి ఉన్నప్పటికీ.. కొన్ని కంపెనీలు ఆ గీత దాటేస్తున్నాయని ఫిర్యాదులు పెరిగాయి. ఈ అక్రమాలను అరికట్టడానికి తనిఖీలు చేపట్టాలని, 3 గంటల డిశ్చార్జ్ గడువును ఖచ్చితంగా అమలు చేయాలని లోకల్ సర్కిల్స్ ఇప్పుడు ఐఆర్‌డీఏఐని కోరుతోంది. పన్ను మినహాయింపు ప్రయోజనం పాలసీదారుడికి చేరకపోగా.. ఇన్సూరెన్స్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని తేల్చింది తాజా సర్వే రిపోర్ట్.