ఢిల్లీ: ఎల్పీజీ సిలిండర్ల గురించి దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం బుధవారం సాయంత్రం కీలక ప్రకటన చేసింది. బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తారని.. సప్లై చైన్ ఇప్పటికీ నిలకడగానే ఉందని కేంద్రం వెల్లడించింది. LPG ఉత్పత్తిని 25 శాతం పెంచామని, హార్ముజ్ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు దిగుమతి చేసుకుంటున్నామని కేంద్రం తెలిపింది.
#WATCH | Delhi | On LPG pricing, Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "The Govt has absorbed the significant part of the cost increase to the increase to protect the consumers. As a temporary demand management… pic.twitter.com/RVRSoGKejC
— ANI (@ANI) March 11, 2026
హార్ముజ్ నుంచి నిలిచిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించామని.. ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఎలాంటి గాబరా అక్కర్లేదని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ చేయడం లేదని దేశంలోని పలు ప్రాంతాల్లో విమర్శలు వస్తున్న క్రమంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.
మన దేశంలోని గ్యాస్ కంపెనీలు.. రెండు ఎల్ఎన్జీ కార్గోల ద్వారా గ్యాస్ను దిగుమతి చేసుకుంటున్నాయని.. ఆ రెండు కార్గోలు త్వరలో ఇండియాకు చేరుకుంటాయని కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. 40 దేశాల నుంచి ఇండియా క్రూడ్ను దిగుమతి చేసుకుంటుందని ఆమె చెప్పారు. మార్చి 7న ఎల్పీజీ ధరలను కేంద్ర ప్రభుత్వం సిలిండర్పై 60 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ సిటీలో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 965 రూపాయలకు పెరిగింది. కేంద్రం ఎల్పీజీ వినియోగదారులకు సంబంధించి సోమవారం నుంచి ఒక కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. 25 రోజుల బుకింగ్ పీరియడ్‌ను ప్రవేశపెట్టింది. అంటే, ఒక సిలిండర్ బుక్ చేసిన 25 రోజుల తర్వాతే తదుపరి బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇది 21 రోజులుగా ఉండేది.
