- గతేడాది జులైతో పోలిస్తే 1,241 కోట్ల అదనపు ఆదాయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వాణిజ్య పన్నుల శాఖ కేవలం ఒక్క జులై నెలలోనే ఏకంగా రూ.7,865 కోట్ల రాబడి సాధించి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. గతేడాది జులైలో నమోదైన రూ.6,624 కోట్లతో పోలిస్తే ఈసారి వసూళ్లు 19 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఒక్క నెలలోనే రూ.1,241 కోట్ల అదనపు ఆదాయం రావడం గమనార్హం. గత ఏప్రిల్‌లో నమోదైన రూ.7,598 కోట్ల ఆల్ టైమ్ హై రికార్డును కూడా ఈ జులై వసూళ్లు దాటేశాయి. జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో ఈ ఆదాయం వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, పన్నుల చెల్లింపులు పెరగడం, అక్రమాలపై నిఘా పెట్టడమే భారీ ఆదాయానికి కారణమని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రఘునందన్ రావు తెలిపారు.
జీఎస్టీ రూపంలోనే రూ.4,452 కోట్లు
జూలై నెలలో ఒక్క జీఎస్టీ రూపంలోనే రూ.4,452 కోట్లు వచ్చాయి. గతేడాది జూలైలోని రూ.3,638 కోట్లతో పోలిస్తే ఇది రూ.814 కోట్లు అదనం. దీనితో జీఎస్టీలో 22 శాతానికి పైగా వార్షిక వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో సాధించిన 19 శాతం వృద్ధికి తోడు.. ఈ నెలలో 22 శాతం వృద్ధి రావడం విశేషం. మరోవైపు తెలంగాణ పరిధిలోని పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన మొత్తం జీఎస్టీ (ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ కలిపి) కలెక్షన్లు రూ.5,819 కోట్లకు చేరాయి. ఇందులో 19 శాతం వృద్ధి నమోదు కాగా, దేశంలోనే హర్యానా తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
