అట్టహాసంగా గీతం 17 వ గ్రాడ్యుయేషన్ డే... 1,990 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం

అట్టహాసంగా గీతం 17 వ గ్రాడ్యుయేషన్ డే... 1,990 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
  • చీఫ్ గెస్ట్​గా హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి

రామచంద్రాపురం, వెలుగు:  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం యూనివర్సిటీ 17వ గ్రాడ్యుయేషన్​ డే శనివారం అట్టహాసంగా జరిగింది. గీతం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 1,990 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఇందులో 1,532 మంది అండర్​ గ్రాడ్యుయేషన్​ స్టూడెంట్స్​ కాగా, 372 మంది పోస్ట్​ గ్రాడ్యుయేషన్, మరో 86 మంది పీహెచ్​డీ స్కాలర్లు ఉన్నారు. సినీ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులకు పట్టాలు ప్రదానం చేశారు. 

గీతం ప్రెసిడెంట్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్​ అధ్యక్షత జరిగిన ఈ వేదికపై చేనేత రంగంలో విశేష కృషి చేసి, వస్ర్త వారసత్వాన్ని పరిరక్షించడంలో సేవలందించిన చేనేత కళాకారుడు గజం గోవర్ధన్​కు గీతం గౌరవ డాక్టరేట్​ను అందించి సత్కరించారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 17 మంది విద్యార్థులకు గోల్డ్​ మెడల్స్​, అత్యుత్తమ పరిశోధన విజయాలు చేపట్టిన గీతం ప్రొఫెసర్లకు బెస్ట్ రీసెర్చర్​ అవార్డులను అందజేశారు. 

బీటెక్​లోని అన్ని విభాగాల్లో టాపర్​గా నిలిచి, కంప్యూటర్ సైన్స్​లో ఫస్ట్ ర్యాంకు సాధించిన ప్రణవ్​ రాహుల్​ అనే విద్యార్ధి రెండు బంగారు పతకాలు అందుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎస్​ఎస్​ రాజమౌళి మాట్లాడుతూ అంకితభావం, కఠోర శ్రమతో ఎంచుకున్న రంగాల్లోనే విజయం సాధించగలమని పేర్కొన్నారు. 

గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ మాట్లాడుతూ విద్యార్థులు తమని తాము నమ్మి కలలు కనాలని, ఏడు మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ తమ కలలను సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతం చాన్స్​లర్​ విరేంద్ర సింగ్ చౌహాన్​, వీసీ ఎర్రోల్​ డిసౌజా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్​ వర్మ, రిజిస్టార్​ గుణసేకరణ్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు