- దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ
- మొదటి విడత సర్వే పూర్తి
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : రాబోయే 30 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇటీవల రాష్ట్రంలోని ముఖ్య ఆలయాలకు మాస్టర్ ప్లాన్ కోసం దేవాదాయ ధర్మాధాయ శాఖ ఒక కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. దీనిలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లేకపోవడంతో స్థానికులు, భక్తులు ప్రభుత్వానికి విన్నపాలు చేయడంతో మాస్టర్ ప్లాన్ తయారీకి అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వారం రోజుల పాటు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక సర్వేను నిర్వహించారు.
మరో రెండు విడతల్లో ఈ సర్వేను పూర్తి చేసి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనున్నారు. ఏడాదికి సుమారు రూ.25 కోట్ల ఆదాయం కలిగిన ఈ ఆలయానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని భక్తులు, స్థానికులు ఎంతో కాలంగా చేస్తున్న విజ్ఞప్తులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
15 ఏండ్ల నుంచి పెండింగ్..
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి అభివృద్ధి కోసం 15 ఏండ్ల కిందనే మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించినప్పటికీ, అది ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఏటా భక్తుల రద్దీ పెరుగుతున్నా తగిన వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆలయ రోడ్లను వెడల్పు చేయడం, భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహాలు, సౌకర్యాలను కల్పించడం వంటి కీలక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన 131 ఎకరాల స్థలంలో భక్తుల సౌకర్యార్థం కొత్త నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బైపాస్ రోడ్డు కోసం డిమాండ్..
ప్రతి ఏడాది 20 లక్షల మంది భక్తులు మల్లన్న దర్శనానికి వస్తే అందులో కేవలం మూడు నెలల జాతర సమయంలోనే దాదాపు పది లక్షలకు పైగా భక్తులు కొమురవెల్లికి వస్తుంటారు. శని, ఆది, సోమ వారాల్లో రద్దీ కారణంగా కిలో మీటర్ల దూరం వరకు వాహనాలు నిలచిపోతుంటాయి. ఈ సమయంలో ఒకటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికే గంటల సమయం పడుతుంది. ఇక హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులతో వారాంతాల్లో రాజీవ్‌రహదారి కిటకిటలాడుతుంది. ఈ ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడానికి రాజీవ్ రహదారి నుంచి రెండు ప్రవేశ ద్వారాలను కలుపుతూ కొమురవెల్లి చుట్టూ బైపాస్ రోడ్డును నిర్మించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
మొదటి విడత సర్వే పూర్తి..
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ కు సర్వే ప్రారంభమైంది. దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం రాబోయే 30 ఏండ్ల వరకు భక్తులకు అవసరమైన పనుల కోసం సర్వే చేపడుతున్నాం. ఇప్పటి వరకు మొదటి విడత సర్వే కంప్లీట్ అయింది. త్వరలో మరోసారి సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్ ను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తాం.
- పి.సుధాకర్‌రెడ్డి , ఆలయ ఈవో
