హైదరాబాద్: తెలంగాణలో భూములకు సంబంధించిన 22A సమస్యపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న భూ రికార్డుల సమస్యలకు చారిత్రక కారణాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనలో ఏర్పడిన రెవెన్యూ విధానం అమల్లో ఉండగా, తెలంగాణలో నిజాం పాలనకు సంబంధించిన రెవెన్యూ విధానం కొనసాగిందని సీఎం తెలిపారు. బ్రిటిష్ పాలకులు భూమిశిస్తు వసూలు కోసం రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించారని చెప్పారు.
తెలంగాణలో దివానీ, నాన్-దివానీ భూములు
తెలంగాణలో సుమారు 60 శాతం భూములు దివానీ భూములుగా ఉండేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవి రాజ్యానికి చెందిన భూములుగా ఉండేవని, ఈ భూముల్లో సాగు చేసిన రైతులు ప్రభుత్వానికి శిస్తు చెల్లించేవారని వివరించారు.మిగిలిన సుమారు 40 శాతం భూములు నాన్-దివానీ భూములుగా ఉండేవని, వీటిలో గణనీయమైన భూములు జాగీర్దార్ల ఆధీనంలో ఉండేవని సీఎం చెప్పారు.
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారత్‌లో విలీనమైన తర్వాత భూముల పరిస్థితిని క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వివరించారు. 60 శాతం భూములకు పక్కాగా హద్దులు ఉండగా, నిజాం, జాగీర్దార్లు, ఇతరులకు సంబంధించిన భూముల్లో అనేక చోట్ల స్పష్టమైన బౌండరీలు లేవని తెలిపారు.
1948-1954 మధ్య భూముల సర్వే
భూముల కొలతల్లో చోటుచేసుకున్న తప్పిదాల కారణంగా అనంతరం అనేక అవకతవకలు ఏర్పడ్డాయని రేవంత్ రెడ్డి అన్నారు. 1948 నుంచి 1954 వరకు భూములపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించినట్లు చెప్పారు.1954ను కటాఫ్ డేట్‌గా తీసుకుని ఖాస్రా పహాణీలు రూపొందించారని సీఎం వివరించారు. సుమారు ఆరేళ్లపాటు నిర్వహించిన సర్వే అనంతరం భూమిపై ప్రత్యక్షంగా సాగు చేస్తున్న వ్యక్తుల ఆధారంగా యాజమాన్య హక్కులను నమోదు చేసినట్లు పేర్కొన్నారు.తెలంగాణలో ఇప్పటికీ 1954లో రూపొందించిన ఖాస్రా పహాణీలు అనేక భూములకు కీలక ఆధారంగా ఉన్నాయని సీఎం తెలిపారు.
నిజాం కాలంలో రెవెన్యూ రికార్డుల వ్యవస్థ
1936లో నిజాం ప్రభుత్వం రెవెన్యూ రికార్డులకు సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1910 నుంచి 1940 మధ్య కాలంలో భూములకు సంబంధించిన గ్రామ నక్షాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నిజాం, జాగీర్దారీ, ఇనాం వ్యవస్థలకు సంబంధించిన భూములు తదనంతరం ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయని సీఎం వివరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజాం, ఇనాం తదితర వర్గాలకు చెందిన భూములు ఉండేవని, ఈ భూములకు సంబంధించిన రికార్డుల్లో స్పష్టత లేకపోవడం కూడా ప్రస్తుత సమస్యలకు ఒక కారణంగా పేర్కొన్నారు.
