వానలు ఆగకుండా పడుతుండటంతో చాలా మంది సర్ది (జలుబు), గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అసలే కరోనా వ్యాప్తి చెందిన ఈ కాలంలో వీటిని త్వరగా తగ్గించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఎప్పుడూ మందులపైనే ఆధారపడకుండా ఇంట్లోనే కొన్నిరకాల డ్రింక్స్ చేసుకుని తగ్గించుకోవచ్చు. గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు లాంటివి తగ్గడంలో తోడ్పడే కొన్ని డ్రింక్స్ ఇవి.
అల్లం చాయ్:
ప్రతి వంటింట్లో ఉండే అల్లంతో తయారు చేసే చాయ్ తాగితే గొంతు నొప్పి ఈజీగా తగ్గుతుంది. అయితే దీనికి ఫ్రెష్ అల్లాన్నే ఉపయోగించాలి.. అందుబాటులో ఉంటే, అప్పుడే తీసిన కాడతో సహా తవ్వితీసిన అల్లాన్ని వాడితే మరింత మంచిది. దీనిపైన సన్నని వేళ్లలా ఉంటాయి. వాటిని కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వాడుకుంటే బెటర్. ఇవి దొరకని వాళ్లు మామూలు అల్లాన్నే వాడుకోవచ్చు.
కావాల్సినవి: అల్లం తరుగు (1 మీడియం సైజ్), మంచి నీళ్లు (1 లీటర్), తేనె (1 టేబుల్ స్పూన్), నిమ్మ చెక్కలు (2).
తయారీ విధానం: అల్లం చెక్కు తీసి, సన్నగా తరగాలి. ఒక పాత్రలో లీటర్ నీళ్లు వేడి చేసి, తరిగిన అల్లం వేసి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత దించి, ఇందులో నిమ్మరసం, తేనె కలిపి వేడిగా కప్పులో పోసుకుని తాగాలి.
చికెన్-లెమన్ సూప్:
గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటివి ఉన్నప్పుడు అన్నం తినాలనిపించదు. పైగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాంటి టైమ్‌లో అటు ఎనర్జీని ఇస్తూ, ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్‌ను తగ్గించడంలో సాయపడే డ్రింక్స్ తీసుకుంటే బెటర్. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ సూప్ చేసుకుని తాగితే మంచిది. అందులో లెమన్ యాడ్ చేసుకుంటే మరింత బాగా పని చేస్తుంది. ఇలాంటి సమయంలో చికెన్ కర్రీ తినడం కంటే సూప్ చేసుకుని తాగితే, త్వరగా క్యూర్ అవుతుంది.
కావాల్సినవి: బోన్‌లెస్ చికెన్ (50 గ్రాములు), అల్లం-వెల్లుల్లి పేస్ట్ (అర టీ స్పూన్), కొత్తిమీర తరుగు (1 టేబుల్ స్పూన్), నిమ్మకాయ (4 చెక్కలు), ఫ్రెష్ క్రీమ్ (1 టేబుల్ స్పూన్), బటర్ (అర టీ స్పూన్), పసుపు (అర టీ స్పూన్), గ్రీన్ చిల్లీ పేస్ట్ (అర టీ స్పూన్), కార్న్‌ఫ్లోర్ (1 టీ స్పూన్), ఉప్పు (తగినంత), నీళ్లు (180 మి.లీ).
తయారీ విధానం: చికెన్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాత్రలో నీళ్లు వేడి చేసి, అందులో చికెన్ ముక్కలు వేయాలి. ఇందులోనే అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ పేస్ట్, క్రీమ్, బటర్, నాలుగు చెక్కల నుంచి తీసిన నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి. సూప్ చిక్కదనం కోసం కార్న్‌ఫ్లోర్ కూడా కలపాలి. లో-ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించి దించేస్తే చికెన్-లెమన్ సూప్ రెడీ.
సినమన్-ఆల్మండ్ మిల్క్:
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే సినమన్ (దాల్చినచెక్క)తో గొంతు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. దీనికి ఆల్మండ్ మిల్క్ కూడా యాడ్ అయితే మరింత బాగా పని చేస్తుంది.
కావాల్సినవి: ఆల్మండ్ మిల్క్ (1 కప్పు), దాల్చినచెక్క పొడి (అర టీ స్పూన్), బేకింగ్ సోడా (కాస్తంత), తేనె (1 టేబుల్ స్పూన్).
తయారీ విధానం: పాన్ వేడి చేసి అందులో దాల్చిన చెక్క పొడి, బేకింగ్ సోడా వేసి కలపాలి. వెంటనే బాదం పాలు పోసి, ఆ రెండింటి మిశ్రమంలో పాలు కలిసేలా కలుపుతూనే ఉండాలి. చిన్న పొంగు వచ్చే వరకు ఉడికించి దించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి తీసుకుని, అందులో తేనె కలపాలి. బాగా కలిశాక వేడిగా తాగాలి.
