సాధారణంగా లైబ్రరీ నుంచి పుస్తకం తీసుకుంటే ఎన్ని రోజుల్లో రిటర్న్ చేస్తాం.. రెండు వారాలు.. స్కూల్స్ కాలేజీల్లో అయితే నెల రోజులు.. ప్రాధాన్యత గల బుక్ అయితే రెండు నెలలు టైం వరకు పొడిగించుకోవచ్చు. లేట్ అయితే ఫైన్ విధిస్తారు మనందరికీ తెలుసు. కానీ ఆస్ట్రేలియాలోని ఓ పుస్తకం మాత్రం ఏకంగా 150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చింది. శతాబ్ధన్నర కాలం తర్వాత బుక్ తిరిగి రావడం ఓ వింత అయితే.. దానికి 19 లక్షల ఫైన్ లెక్కగట్టారు లైబ్రరీ మేనేజ్ మెంట్. ఒక ఇంటి గోడల్లో దాగి ఉన్న ఈ పాత పుస్తకం వెనుక ఓ ఆసక్తికరమైన మిస్టరీ కథ దాగి ఉంది. అదేంటో తెలుసుకుందాం.
1858లో ప్రచురించిన యాంటిక్విటీస్ అఫ్ ఏథెన్స్ అనే పుస్తకం ఆస్ట్రేలియాలోని కియామా లైబ్రరీ నుంచి ఎప్పుడో కనిపించకుండా పోయింది. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఓ ఇంటి రిపేరింగ్ పనుల్లో ఈ పుస్తకం అనుకోకుండా బయటపడింది.
ఇంటిని రిపేర్ చేస్తుండగా.. మూసివేసిన పొయ్యిలో ఇటుకల మధ్య దాచిన టీ పెట్టె కనిపించింది. అందులో ఉన్న వస్తువులను పరిశీలించగా, అది ఏళ్ల క్రితం లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన అరుదైన పుస్తకమని గుర్తించారు. వెంటనే దానిని కియామా లైబ్రరీకి అందించారు.
కియామా లైబ్రరీ మేనేజర్ మిషెల్ హడ్సన్ లెక్కల ప్రకారం ఈ పుస్తకాన్ని ఇంత ఆలస్యంగా తిరిగి ఇచ్చినందుకు జరిమానా దాదాపు రూ.18.7 లక్షలు ఉండేది. అయితే లైబ్రరీ అధికారులు జరిమానా విధించకుండా, ఈ పుస్తకాన్ని చారిత్రక సంపదగా భద్రపరచాలని నిర్ణయించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పుస్తకాన్ని చివరిగా ఎవరు తీసుకెళ్లారో ఇప్పటికీ తెలియదు. అప్పటి లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకున్నవారి వివరాలు ఉన్న పాత రికార్డులు కూడా అందుబాటులో లేవు. ఏళ్ల తరబడి దాచిపెట్టబడిన ఈ పుస్తకం ఇప్పుడు కియామా లైబ్రరీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఇకపై దీనిని బయటకు ఇవ్వకుండా లైబ్రరీ మ్యూజియం ప్రదర్శనలో ఉంచేందుకు నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
