చందానగర్, వెలుగు: చందానగర్‌లోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ జ్యువెలరీ దుకాణంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. షాప్ వెనుక భాగం నుంచి లోపలికి చొరబడి సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి వెంట బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ పక్కన ఉన్న బాలాజీ జ్యువెలరీ షాప్‌ను శుక్రవారం రాత్రి 11 గంటలకు నిర్వాహకులు మూసివేశారు.
శనివారం ఉదయం వచ్చి చూడగా షాప్‌లో వస్తువులు చిందరవందరగా కనిపించాయి. దుండగులు షాప్ వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం వెనుక గది నుంచి ముందు గదికి వెళ్లే తలుపుకు మరో రంధ్రం చేసి బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. షాపు యజమాని శివశంకర్ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సంఘటన స్థలాన్ని శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్, రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.
