యాంటీ-పేపర్ లీక్ చట్టంపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్

యాంటీ-పేపర్ లీక్ చట్టంపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
  • రాష్ట్రపతి ఆమోదంతో శుక్రవారం నుంచే చట్టం అమల్లోకి

న్యూఢిల్లీ: ఎగ్జామ్ పేపర్ల లీకేజీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ-పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దాంతో ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) అమెండ్‌మెంట్‌ బిల్లు చట్టంగా మారినట్లు పేర్కొంటూ లా మినిస్ట్రీ శుక్రవారం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ తో బిల్లుకు పూర్తిస్థాయి చట్టబద్ధత చేకూరిందని కేంద్రం తెలిపింది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ(శుక్రవారం) నుంచే ఈ చట్టంలోని నిబంధనలన్నీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.నీట్  పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం యాంటీ-పేపర్ లీక్ చట్టాన్ని అత్యంత త్వరగా అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. పేపర్ లీక్ కేసుల దర్యాప్తును కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షల్లో అక్రమాలు లేదా పేపర్ లీక్‌లకు పాల్పడే వ్యక్తులకు కనీసం ఐదు నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ ఇవి వ్యవస్థీకృత నేరాలు(ఆర్గనైజ్డ్ క్రైమ్స్)గా  తేలితే.. కనీసం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు ఏకంగా రూ. 10 కోట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్నాపత్రాలు లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్లను మార్చడం, నకిలీ వెబ్‌సైట్లు లేదా అడ్మిట్ కార్డులు సృష్టించడం వంటి 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. నిందితులకు త్వరగా శిక్షలు ఖరారు చేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చట్టం స్పష్టం చేస్తోంది. ఛార్జ్‌షీట్ దాఖలు అయిన నాటి నుంచి కేవలం మూడు నెలల్లోపే కోర్టులు విచారణ ప్రక్రియను పూర్తి చేయాలి. యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, రైల్వేలు, బ్యాంకింగ్, ఎన్టీఏ వంటి సంస్థలు నిర్వహించే అన్ని పబ్లిక్ పరీక్షలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.