అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. క్రూడ్ ఆయిల్, సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సమాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే పలు హోటల్స్ మూతపడగా.. హాస్టల్స్ లో మెనూలో చాలా మార్పులు చేశారు. చివరికి గ్యాస్ లేక కట్టెల పొయ్యిపైన వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం (మార్చి 11) హైదరాబాద్ లోని KPHB కాలనీలో గ్యాస్ లేకపోవడంతో రోడ్డుపైన కట్టెల పొయ్యిపైన వంటలు చేస్తుండటం గ్యాస్ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న హాస్టల్‌లో గ్యాస్ కొరత తీవ్ర సమస్యగా మారింది. హాస్టల్‌లో వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది, నివాసితులు రోడ్డుపై తాత్కాలికంగా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హాస్టల్‌లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు భోజనానికి ఇబ్బందులు పడుతుండటంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయంగా బయట వంటలు ప్రారంభించారు. రోడ్డుపై వంటలు చేయడం వల్ల స్థానికంగా కొంత అసౌకర్యం కూడా ఏర్పడింది. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించాలని హాస్టల్‌లో నివసించే వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు గ్యాస్ సమస్యతో హాస్టళ్లలో మెనూ పూర్తిగా మార్చేశారు నిర్వాహకులు. కేవలం రెండు పూటల మాత్రమే భోజనం అందించగలమని ప్రకటించారు. ఉదయం టిఫిన్స్, బ్రేక్ ఫాస్ట్ లు ఇవ్వడం వీలుకాదని చెప్పినట్లు పలు హాస్టల్లో ఉంటున్న బోర్డర్స్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఉందని.. అదే జరిగితే కాలేజీలకు, ఉద్యోగాలకు ఎలా వెళ్లాలని ఆవేదని వ్యక్తం చేస్తున్నారు.
