యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే..

యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే..

మీరు యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రాబోతున్న కొత్త రూల్స్ గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. తన వినియోగదారులకు మరింత స్పష్టతనిచ్చేందుకు, వ్యయ పరిమితులను మెరుగుపరిచేందుకు బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ విధానాల్లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా యుటిలిటీ బిల్లులు, ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు, డిజిటల్ వాలెట్ లోడింగ్ పై ఈ కొత్త రూల్స్ ప్రభావం చూపనున్నాయి.

సాధారణంగా విద్యుత్, నీరు, గ్యాస్ లేదా ఇంటర్నెట్ బిల్లులు చెల్లించినప్పుడు బ్యాంకులు సర్‌ఛార్జీలు విధిస్తుంటాయి. అయితే యెస్ బ్యాంక్ ఇప్పుడు 'ఫ్రీ లిమిట్'ను భారీగా పెంచింది. అంటే మీరు ఇకపై పెంచిన చెల్లింపు లిమిట్స్ వరకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా బిల్లులు కట్టుకోవచ్చు. ఉదాహరణకు.. యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు నెలకు రూ.లక్ష వరకు ఎటువంటి ఫీజు లేకుండా బిల్లులు చెల్లించవచ్చు. గతంలో ఈ లిమిట్ రూ.50వేలుగా ఉండేది. అలాగే మార్క్యూ, రిజర్వ్ కార్డ్ హోల్డర్లకు ఈ పరిమితిని రూ.50వేలకు.. ఇతర రిటైల్ కార్డ్ యూజర్లకు రూ.25వేలకు పెంచింది బ్యాంక్. ఈ లిమిట్ దాటితే మాత్రం యుటిలిటీ అండ్ సర్వీస్ ట్రాన్సాక్షన్ ఫీ కట్టాల్సి ఉంటుంది కార్డ్ హోల్డర్లు. 

ప్రయాణాల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా టోల్ ప్లాజాలు లేదా బ్రిడ్జ్ ఫీజులు చెల్లించే వారికి కూడా కొత్త రూల్స్ ప్రకటించింది యెస్ బ్యాంక్. ప్రీమియం కార్డ్ హోల్డర్లు నెలకు రూ.75వేల వరకు, ఇతర కార్డ్ వినియోగదారులు రూ.50వేల వరకు ఎటువంటి అదనపు ఫీజు లేకుండా ఖర్చు చేయవచ్చు. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీలపై 1 శాతం ఫీజుతో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అదనపు రుసుము ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.5వేలకు మించకుండా బ్యాంక్ పరిమితి విధించింది.

పేటీయం, అమెజాన్ పే, మోబిక్విక్ లేదా క్రెడ్ వంటి థర్డ్ పార్టీ డిజిటల్ వాలెట్లలోకి డబ్బును లోడ్ చేసే వారికి కూడా మార్పులు జరిగాయి. కొత్త రూల్స్ ప్రకారం రూ.2వేల వరకు చేసే లోడింగ్‌లపై ఎటువంటి రుసుము ఉండదు. కానీ రూ.2వేలు దాటిన ప్రతి లావాదేవీపై 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఈ మార్పుల వల్ల వినియోగదారులు తమ నెలవారీ ఖర్చులను ప్లాన్ చేసుకోవడం సులభతరం అవుతుంది. పెంచిన పరిమితుల వల్ల సామాన్య వినియోగదారులపై అదనపు భారం తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుండి మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ మార్పులను పరిశీలించుకోండి.