లోక్ సభలో స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

లోక్ సభలో స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై బుధవారం (మార్చి 11) దాదాపు పది గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానాన్ని లోక్ సభ తిరస్కరించింది. అధికార, విపక్ష సభ్యుల గందరగోళం మధ్య మోషన్ తిరస్కరణకు గురైనట్లు యాక్టింగ్ స్పీకర్ జగదాంబికా పాల్ ప్రకటించారు. 

విపక్ష సభ్యుల విషయంలో పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారని.. అందుకు స్పీకర్ ఓం  బిర్లాను తొలగించాల్సిందిగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ మమహ్మద్ జావేద్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి విపక్ష సభ్యులు మద్ధతు ఇవ్వడంతో చర్చ చేపట్టారు. తీర్మానం వీగిపోవడంతో గురువారం (మార్చి 12) స్పీకర్ ఓం బిర్లా యధావిధిగా చైర్ లోకి వస్తారు. 

రాహుల్ గాంధీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు:

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటరీ రాజకీయాల్లో స్పీకర్ పై తెచ్చిన ఈ తీర్మానం విచారకరమైన చర్యగా అభివర్ణించారు. స్పీకర్ అధికార, ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తారని.. కానీ ఆయనపై తీర్మానం పెట్టడం బాధాకరమన్నారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు అమిత్ షా. సభలో మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు కొందరు నేతలు జర్మనీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా అపోజిషన్ వ్యవహరించిందని విమర్శించారు. 

స్పీకర్ ది పక్షపాత వైఖరి:

చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు బట్టారు ప్రతిపక్ష నేతలు. పార్లమెంటు గౌరవం దెబ్బతినేలా చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.. మేము కూడా అదే అంటున్నాం.. పక్షపాత ధోరణితో పార్లమెంటు గౌరవాన్ని భంగం కలిగించరాదనేదే తమ వాదన.. అని విపక్షాలు వాదించాయి. 

పార్లమెంటులో ప్రతిపక్షాల నేతలకు సరైన రక్షణ లేకుండా పోయిందనీ.. సమయం కేటాయింపులో పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. సమన్యాయం చేయాల్సిన స్పీకర్.. ఒక పక్షానికి కొమ్ముకాయడంతోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు ఆర్జేడీ ఎంపీ అభయ్ కుమార్ అన్నారు. 

ఒకే రోజు 140 మందిని సస్పెండ్ చేసిన దారుణ చరిత్ర ఎన్డీఏ హయాంలో చూశామని మండిపడ్డారు. అధికార పక్షాన్ని ప్రశ్నించినందుకే ఇలా సస్పెండ్ చేయడం ఎక్కడా చూడలేదన్నారు. విపక్ష సభ్యులు అడిగే కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మైక్ కట్ చేయడం, సస్పెండ్ చేయడం వంటి ధోరణి స్పీకర్ అవలంభించారని మండిపడ్డారు. కానీ నిజమైన ప్రజాస్వామ్యంలో బలహీనులు, పేదలు ఎవరైనా తమ గొంతుకను వినే అవకాశం ఉందనేలా భరోసా ఇవ్వడమేనని అన్నారు. పార్లమెంటులో విపక్ష సభ్యులకే ఆ అవకాశం లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు విపక్ష సభ్యులు.