యుద్ధంతో గ్యాస్ సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఎల్‌పీజీ కొరత ఏర్పడటం.. ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు వంట కోసం గ్యాస్ పొయ్యిలకు బదులు ఇండక్షన్ కుక్కర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు వాడాలని ఆదేశించడంతో స్టాక్ మార్కెట్‌లో ఒక వినూత్న ట్రెండ్ కనిపించింది ఇవాళ. గ్యాస్ కొరత సంక్షోభం కారణంగా కిచెన్ అప్లయన్సెస్.. గ్యాస్ పంపిణీ రంగంలోని కీలక కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.
ప్రజలు గ్యాస్ సిలిండర్ల నుంచి విద్యుత్ ఆధారిత వంట పరికరాల వైపు మళ్లుతారనే అంచనాలతో TTK ప్రెస్టీజ, స్టవ్ క్రాఫ్ట్, బటర్‌ఫ్లై గాంధీమతి కంపెనీల షేర్లలో పండుగ వాతావరణం కనిపించింది. ముఖ్యంగా ఈ కంపెనీల షేర్లు ఒకే రోజు 17 శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, స్మార్ట్ కిచెన్ అప్లయన్సెస్ తయారీలో ఈ కంపెనీలు మార్కెట్ లీడర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం తీవ్రమైతే ఈ కంపెనీల ఉత్పత్తులకు గిరాకీ అమాంతం పెరుగుతుందనే ఆశతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. రిటైల్ మార్కెట్లలో కూడా ఇండక్షన్ స్టౌల అమ్మకాలు గ్యాస్ షార్టేజీతో ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెప్పటం దీనికి సపోర్టింగ్ గా ఉంది.
►ALSO READ | దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్: రూ.8 లక్షల కోట్లు ఆవిరి.. అయోమయంలో ఇన్వెస్టర్లు
మరోవైపు.. గ్యాస్ సరఫరా రంగంలో ఉన్న అదానీ టోటల్ గ్యాస్ షేర్లు కూడా నేడు మార్కెట్ పతనంలోనూ నిలదొక్కుకుని ర్యాలీ చేశాయి. పైప్డ్ నేచురల్ గ్యాస్, సీఎన్‌జీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈ కంపెనీకి కలిసి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, సరఫరా వ్యవస్థలో పట్టున్న కంపెనీ కావడంతో ఇన్వెస్టర్లు దీనిపై బెట్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటికి తోడు హావెల్స్, వీ-గార్డ్ వంటి ఎలక్ట్రికల్ కంపెనీలు కూడా తమ లాభాల జోరును కొనసాగించాయి.
ప్రపంచమంతా స్మార్ట్ కుకింగ్, ఎలక్ట్రిక్ వంట పద్ధతుల వైపు మళ్లుతున్న తరుణంలో.. ఈ గ్యాస్ కొరత ఆ మార్పును మరింత వేగవంతం చేస్తోంది. సంప్రదాయ ఇంధన వనరుల ధరలు పెరగడం, కొరత ఏర్పడటం వంటి అంశాలు ఇండక్షన్, గ్రీన్ ఎనర్జీ ఆధారిత పరికరాల తయారీ సంస్థలకు దీర్ఘకాలికంగా లాభం చేకూరుస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే మార్కెట్ అంతా నష్టాల్లో ఉన్నా, ఈ నిర్దిష్ట షేర్లు మాత్రం లాభాలతో కళకళలాడుతున్నాయి.
