భారత స్టాక్ మార్కెట్లు బుధవారం అనుకోని మలుపును చూశాయి. నిన్నటి లాభాల ఉత్సాహంతో ఉదయం ఓపెన్ అయిన మార్కెట్లు కొద్ది సేపటికే తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ సెషన్ నాటికి కీలక సూచీలు భారీగా నష్టపోవటంతో ఆ ప్రభావం క్లోజింగ్ వరకూ అలాగే కొనసాగింది. ఈ పరిస్థితులు ఇన్వెస్టర్లకు అయోమయం కలిగిస్తున్నాయి.
మార్కెట్లు క్లోజ్ కావటానికి కొన్ని నిమిషాల ముందు 1420 పాయింట్ల వరకూ పతనమైన బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ చివరికి 1342 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ముగించింది. దీని కారణంగా ఇన్వెస్టర్లకు చెందిన సంపద దాదాపు రూ.8 లక్షల కోట్ల వరకూ ఆవిరైంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 395 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 716 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1215 పాయింట్ల నష్టపోయాయి క్లోజింగ్ నాటికి.
ఇరాన్ సముద్ర జాలల సమీపంలో 3 కార్గో నౌకలపై దాడి జరిగినట్లు బ్రిటన్ ప్రకటించటం మార్కెట్లలో భారీ నష్టాలకు ఒక ట్రిగరింగ్ పాయింట్ అని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ షిప్పింగ్ జరగకుండా ఇరాన్ హోర్ముజ్ జలసంధి వద్ద మైన్లు ఏర్పాటు చేయటం, దాడులకు తెగబడటం లాంటి చర్యలు ఇబ్బంది కలిగిస్తున్నాయని వారు అంటున్నారు. దీంతో కేవలం క్రూడ్ ఆయిల్, గ్యాస్ మాత్రమే కాకుండా భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే వంటనూనెల రేట్లు కూడా పెరగటం స్టార్ట్ అయ్యాయి. ఇరాన్ వార్ ఓ కొలిక్కి వస్తేనే కానీ మళ్లీ ఇన్వెస్టర్లలో జోష్, ధైర్యం కనిపించవని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
►ALSO READ | గ్యాస్ షార్టేజీతో IRCTC అలర్ట్.. ఇండక్షన్ పొయ్యిలపై వంటలకు ఆదేశం
మార్కెట్ల క్లోజింగ్ నాటికి ఆటో, ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ బ్యాంకులు, కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, రియల్టీ రంగాలు భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇదే క్రమంలో ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా సూచీలు మాత్రమే మెరుగైన ప్రదర్శనతో లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల్లో క్లోజ్ కాగా.. ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్టాక్స్ మాత్రం భారీ నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.
