హైదరాబాద్ జీసీసీల్లో ఏఐపై సదస్సు

హైదరాబాద్ జీసీసీల్లో ఏఐపై సదస్సు

హైదరాబాద్​, వెలుగు: ‘ఏఐ నేటివ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల భవిష్యత్​’ అనే మెయిన్​ థీమ్‌‌‌‌తో  హైదరాబాద్ సాఫ్ట్‌‌‌‌వేర్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), త్రీఏఐ హైదరాబాద్​లో శుక్రవారం జీసీసీఎక్స్ 2026 సదస్సును నిర్వహించాయి. కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి 1,200 మందిపైగా ప్రతినిధులు, 70కి పైగా గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్లు హాజరయ్యారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల కేంద్రంగా మారుతున్న తరుణంలో ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

టెక్​ కంపెనీల పనితీరును ఏఐ ఎలా మారుస్తోందనే విషయమై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. బిజినెస్ ఆపరేటింగ్ మోడల్స్‌‌‌‌ను మార్చడం, ఆటోమేషన్‌‌‌‌ను పెంచడం , భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం వంటి కీలక విషయాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  

కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో తయారు చేసిన మేకింగ్ వాల్యూ విజిబుల్ అనే ప్రత్యేక వైట్‌‌‌‌పేపర్‌‌‌‌ను అధికారికంగా ఆవిష్కరించారు.  దేశంలోని అగ్రశ్రేణి జీసీసీ సంస్థలను గుర్తించి వారి ప్రతిభను అభినందించేందుకు జీసీసీ వన్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు.