హైదరాబాద్, వెలుగు: ఆర్థిక సేవలు అందించే హైదరాబాద్ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం) హోల్డింగ్స్ రూ.150 కోట్ల నిధులు సేకరించింది. కార్పెడియం క్యాపిటల్ , సాన్షి ఫండ్ వన్ సంయుక్తంగా ఈ వ్యూహాత్మక మూలధనాన్ని అందజేయనున్నాయి.
ఈక్విటీ షేర్లు, ఫుల్లీ కన్వర్టెడ్ వారెంట్ల రూపంలో ఒక్కో షేరుకు రూ.143.28 చొప్పున ఈ నిధులను సేకరిస్తున్నారు. ఆస్తుల పరిరక్షణ, రిస్క్ అడ్వైజరీ సేవలను అందిస్తున్న ఈ సంస్థ భారతదేశంతోపాటు సింగపూర్, శ్రీలంక, మాల్దీవులు, కెన్యాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
తాజాగా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ, వ్యూహాత్మక పెట్టుబడులు, విలీనాలు, కొనుగోళ్లు , కార్యకలాపాల అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు ఐఐఆర్ఎం చైర్మన్ రామకృష్ణ తెలిపారు. గ్రూప్ ప్రధాన కంపెనీ ఇండియా ఇన్సూర్ రిస్క్ మేనేజ్మెంట్ సంస్థ రెండు వేల మందికి పైగా కార్పొరేట్ క్లయింట్లు, లక్ష మందికి పైగా రిటైల్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.1,600 కోట్ల విలువైన బిజినెస్ వాల్యూమ్‌ను నిర్వహించింది. భవిష్యత్తులో చిన్న, మధ్యతరహా ఇన్స్యూరెన్స్ బ్రోకర్ల కొనుగోళ్ల ద్వారా మార్కెట్లో మరింత బలపడాలని ఐఐఆర్ఎం భావిస్తోంది.
