కామన్వెల్త్‌లో జూడో జోరు.. అస్మిత, హర్ష్‌లకు స్వర్ణాలు

కామన్వెల్త్‌లో జూడో జోరు.. అస్మిత, హర్ష్‌లకు స్వర్ణాలు
  • డిస్కస్‌‌ త్రోలో సీమాకు సిల్వర్‌‌ 
  • టీటీలో రెండు స్వర్ణాలు

గ్లాస్గో: కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో ఇండియా జూడో ప్లేయర్ల గోల్డెన్‌‌ పట్టు అదిరింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌ 48 కేజీల విభాగంలో అస్మితా దే స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌‌ పోరులో అస్మిత.. హీడీ క్వాచ్‌‌ (కెనడా)ను గోల్డెన్‌‌ స్కోరు పద్ధతిలో ఓడించింది. దాంతో కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో స్వర్ణం నెగ్గిన తొలి ఇండియన్‌‌ జూడో ప్లేయర్‌‌గా అస్మిత రికార్డులకెక్కింది. బౌట్‌‌ ఆరంభంలో క్వాచ్‌‌ యూకో సాధించడంతో అస్మితాకు పెనాల్టీ పడింది. కానీ వెంటనే పుంజుకున్న ఇండియన్‌‌ ప్లేయర్‌‌ దూకుడుగా ఆడి 1–1తో స్కోరును సమం చేసింది. 

నిర్ణీత నాలుగు నిమిషాల సమయం ముగిసేసరికి ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో ఫలితం తేలలేదు. దాంతో మ్యాచ్‌‌ను గోల్డెన్‌‌ స్కోరు (సడెన్‌‌ డెత్‌‌)కు మార్చారు. ఒత్తిడిని జయించిన అస్మిత.. నిర్ణయాత్మక ఎటాక్‌‌తో మరో యూకో సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 1990లో ఆక్లాండ్‌‌ కామన్వెల్త్‌‌లో జూడోను మొదలుపెట్టినప్పట్నించి ఇండియన్‌‌ జూడోలు అన్ని ఎడిషన్లలో పతకాలు నెగ్గారు. కానీ ఎవరూ గోల్డ్‌‌ మెడల్‌‌ సాధించలేదు. మెన్స్‌‌ 60 కేజీల విభాగంలో హర్ష్‌‌ సింగ్‌‌ కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 

ఫైనల్లో హర్ష్‌‌.. జోషువా కాట్జ్‌‌ (ఆస్ట్రేలియా)పై అనూహ్యంగా గెలిచాడు. దాంతో ఈ గేమ్స్‌‌లో గోల్డ్ నెగ్గిన తొలి పురుష జూడోగా చరిత్ర సృష్టించాడు. అత్యంత అనుభవజ్ఞుడైన కాట్జ్‌‌ ఈ బౌట్‌‌లో ఫేవరెట్‌‌గా దిగాడు. కానీ 23 ఏళ్ల హర్ష్‌‌ ప్రశాంతంగా వ్యూహాత్మకమైన పెర్ఫామెన్స్‌‌ చూపెట్టాడు. ఆరంభం నుంచి ఇద్దరు జూడోలు పట్టు వదలకుండా పోరాడటంతో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. అయితే 41 సెకన్లు మిగిలి ఉండగా హర్ష్‌‌ రెండో అత్యధిక స్కోరింగ్‌‌ టెక్నిక్‌‌ అయిన వజాఅరిని ప్రదర్శించాడు. విమెన్స్​ 57 కేజీల్లో యామిని మౌర్య సిల్వర్​ మెడల్​ను గెలుచుకుంది.