- శామ్‌సంగ్, ఎస్‌కే హైనిక్స్ షేర్ల ర్యాలీతోనే..
- కొరియా మార్కెట్‌ను శాసిస్తున్న ఈ రెండు కంపెనీలు
- ఇంకా జూన్ స్థాయిల నుంచి 29 శాతం డౌన్‌లో కొస్పీ
- దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లు
సియోల్: సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ శుక్రవారం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే రోజు 18 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. ఏఐ షేర్ల అమ్మకాలు కొనసాగడంతో జూన్ స్థాయిల నుంచి 40 శాతం వరకు పోడియిన సౌత్ కొరియా కొస్పీ ఇండెక్స్, శుక్రవారం కోలుకొని 6,600 దగ్గర ముగిసింది. అమెరికన్ టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టెక్ షేర్లలో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ఈ అనూహ్య ర్యాలీ చోటుచేసుకుంది. కొస్పీలో కేవలం రెండు చిప్ తయారీ కంపెనీలు ఎస్‌కే హైనిక్స్, శామ్‌సంగ్‌లు కలిపి 50–60 శాతం వాటా కలిగి ఉన్నాయి. దీంతో తీవ్ర వోలటాలిటీ కనిపిస్తోంది.
టెక్ కంపెనీల సునామీ
గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజాలు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ , ఎస్‌కే హైనిక్స్ షేర్లు శుక్రవారం ఏకంగా 28శాతం నుంచి 30శాతం వరకు (అప్పర్ లిమిట్) పెరిగి ఇన్వెస్టర్లను సంబరాల్లో ముంచాయి. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ ఏఐ బూమ్ వలన కోస్పి సూచీ ఏకంగా 122శాతం పెరిగి జూన్ నాటికి 9,386 వద్ద ఆల్‌టైమ్ రికార్డు గరిష్టాన్ని తాకింది. అయితే, ఆ తర్వాత మార్కెట్ దారుణమైన పతనాన్ని చూసి, జులై 30 నాటికి గరిష్టాల నుంచి ఏకంగా 40శాతం పడిపోయి 5,600 స్థాయికి జారింది.
సూచీలోని సగానికి పైగా వాటా కేవలం ఈ రెండు చిప్‌మేకర్లదే కావడం, దానికి తోడు వీటి ఆధారిత సింగిల్ స్టాక్ లెవరేజ్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఎక్కువ కావడంతో రిస్క్ విపరీతంగా పెరిగింది. ఈ తీవ్ర వోలటాలిటీని చూసి ఆర్థిక విశ్లేషకులు దక్షిణ కొరియా మార్కెట్‌ను 'బైపోలార్ డిజార్డర్' కలిగిన మార్కెట్‌గా అభివర్ణించారు కూడా. అంటే రాత్రికి రాత్రే తీవ్ర భయం నుంచి తీవ్ర ఉత్సాహానికి మారిపోయే నైజం అని దీని అర్థం.
మార్కెట్ తీవ్రంగా పతనమవ్వడంతో సింగిల్ స్టాక్ లెవరేజ్డ్ ఈటీఎఫ్‌లలో భారీగా పెట్టుబడి పెట్టిన వేలాదిమంది రిటైల్ ఇన్వెస్టర్లు రోడ్డున పడ్డారు. దీంతో ఆగ్రహించిన ఇన్వెస్టర్లు సియోల్‌లోని నేషనల్ అసెంబ్లీ (పార్లమెంట్) భవనం ఎదుట నిరసనలు తెలిపారు. "రిటైల్ ఇన్వెస్టర్లను ఊచకోత కోశారు" "ఓటింగ్ రూపంలో మీకు బుద్ధి చెబుతాం"అనే వ్యాఖ్యలున్న రిబ్బన్లు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. దీంతో సౌత్ కొరియా ఆర్థిక మంత్రి కూ యున్-చోల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సింగిల్ స్టాక్ లెవరేజ్డ్ ఈటీఎఫ్‌ల అనుమతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయామని ఒప్పుకున్నారు.
బ్రోకరేజ్‌ల సపోర్ట్ ..
కొస్పీ శుక్రవారం ర్యాలీతో కొంత ఊరట లభించినప్పటికీ, ఈ ఇండెక్స్ జూన్ గరిష్ట స్థాయిల కంటే ఇంకా 29శాతం తక్కువలోనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, లెవరేజ్డ్ ఫండ్స్ ముగింపు దశకు చేరుకున్నందున.. కంపెనీలు తమ సొంత షేర్ల బైబ్యాక్, ట్రెజరీ షేర్ల రద్దు ప్రక్రియ ద్వారా మార్కెట్ మళ్లీ 10,000 –- 11,000 పాయింట్ల స్థాయి వైపు పుంజుకుంటుందని బ్రోకరేజ్ సంస్థ నోమురా ధీమా వ్యక్తం చేసింది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొరియా రేటింగ్‌ను 'న్యూట్రల్'కు సిటీ గ్రూప్ తగ్గించినప్పటికీ, దీర్ఘకాలికంగా సెమీకండక్టర్, ఏఐ భవిష్యత్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది.
