వెంకటాపురం, వెలుగు: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ 163 జాతీయ రహదారిపై చీకుపల్లి సమీపంలో గోదావరి వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులను స్థానికులు నాటు పడవల ద్వారా దాటిస్తున్నారు.
ఒక్కో ప్రయాణికుడికి రూ.50, ద్విచక్ర వాహనానికి రూ.100 వసూలు చేస్తున్నారు. పడవల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలతో డైవర్షన్ రోడ్డు దెబ్బతినడం, గోదావరికి భారీ వరద రావడంతో సుమారు 100 మీటర్ల మేర జాతీయ రహదారి నీటమునిగింది.
దీంతో ఛత్తీస్‌గఢ్‌తో పాటు 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో వెంకటాపురం–భద్రాచలం రాష్ట్ర రహదారిపై పలుచోట్ల వరద చేరింది. దీంతో అధికారులు రహదారిని మూసివేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేయగా, అత్యవసర ప్రయాణికులు oటునాగారం మీదుగా వెళ్లాలని సీఐ ముత్యం రమేశ్సూచించారు.
