మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే, ప్రధాని మోదీ దేశం మొత్తం నాశనం చేశాడని మాలమహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్సీ రిజర్వేషన్ తో వందలో ఒకరిద్దరికి మాత్రమే మేలు జరుగుతోందని, ఈ ఫలాలను సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు మోదీ, తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని, ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని నిలదీశారు.
సామాజిక న్యాయం దళితులకు ఇచ్చే రిజర్వేషన్లలో మాత్రమేనా, ఈ దేశ సంపదలో అక్కర్లేదా, క్యాబినెట్లో మంత్రి పదవుల విషయంలో అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీరం సతీశ్‌కుమార్, తలారి రాజన్న, ఎడ్ల కృష్ణయ్య, కానుగడ్డ యాదయ్య కాశయ్య, భైరం పల్లి నారాయణ, బోగరి విజయ్ కుమార్, అనిమల్ల నరహరి, నాని, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
