మహిళలపై లైంగిక వేధింపులు.. ఎస్సై శ్రీకాంత్ అరెస్ట్..మూడు నెలలుగా పరారీ.. నిజమాబాద్ లో అరెస్ట్

మహిళలపై లైంగిక వేధింపులు.. ఎస్సై శ్రీకాంత్ అరెస్ట్..మూడు నెలలుగా పరారీ.. నిజమాబాద్ లో అరెస్ట్

హనుమకొండ, వెలుగు : మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఎస్సై కదిరె శ్రీకాంత్  గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లాకు  చెందిన శ్రీకాంత్ 2014 బ్యాచ్ లో ఎస్సైగా ఎంపికయ్యాడు. సోషల్ మీడియా ద్వారా మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకునేవాడు. తర్వాత లైంగికంగా వేధించేవాడు. 

ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేయడంతో అప్పట్లో జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తర్వాత హనుమకొండ సుబేదారి పీఎస్ పరిధిలో భర్త చనిపోయి పిల్లలతో ఉంటున్న మహిళ పరిస్థితులు తెలుసుకుని గతేడాది మేలో ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

అనంతరం ఫొటోలు, వీడియోలు ఉన్నాయంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ లో బాధితురాలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై శ్రీకాంత్ పోలీసులకు చిక్కకుండా గోవా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తిరగడం మొదలుపెట్టాడు. అతడు నిజామాబాద్ లో ఉన్నట్లు తెలుసుకున్న సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. 

హనుమకొండ జిల్లా మూడో అడిషనల్ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సుబేదారి సీఐ రంజిత్ కుమార్ వివరించారు. తిమ్మాపూర్ ఎస్సైగా పని చేస్తున్న సమయంలోనూ ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో సస్పెన్షన్ కు గురయ్యాడు. తర్వాత జమ్మికుంట ఎస్సైగా విధుల్లో చేరాడు.