రాత్రిపూట ఇడ్లీ బండి పెట్టాడని జైల్లో పెట్టిన పోలీసులు... ఛీకొడుతున్న నెటిజన్స్..

రాత్రిపూట ఇడ్లీ బండి పెట్టాడని జైల్లో పెట్టిన పోలీసులు... ఛీకొడుతున్న నెటిజన్స్..

హైదరాబాద్ 24 గంటలు నిద్రపోని గ్లోబల్ సిటీగా, నైట్ ఎకానమీకి కేరాఫ్ అడ్రస్ గా మార్చేస్తామంటూ ప్రభుత్వం చెబుతుంటే.. మల్కాజిగిరి పోలీసులు చేసిన ఘనకార్యానికి నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు. అర్థరాత్రి పూట ఇడ్లీ బండి పెట్టాడని ఓ చిరువ్యాపారిని అరెస్ట్ చేసి రెండు రోజులు జైల్లో పెట్టారు మల్కాజిగిరి పోలీసులు. అంతే కాకుండా ఏదో ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.

పొట్టకూటి కోసం విజాయితిగా కష్టపడి బతుకుతున్న సామాన్యులను క్రిమినల్స్ లాగా చూస్తూ కేసులు బనాయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు నిబంధనల పేరుతో చిరు వ్యాపారులను,సామాన్యులను  వేధించడం సరికాదని అంటున్నారు. 

ఈ ఘటనపై నెటిజన్స్ మాత్రమే కాకుండా పౌర హక్కుల సంఘాలు కూడా సీరియస్ అయ్యాయి. అయితే.. తీవ్రస్థాయిలో విమర్శలు రావాడంతో ఎక్స్ నుంచి సదరు పోస్ట్ డిలీట్ చేశారు పోలీసులు. అప్పటికే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నైట్ ఎకానమీకి వెన్నెముక లాంటి చిరు వ్యాపారులను అణిచివేయడం సరికాదని అంటున్నారు నెటిజన్స్. పోలీసుల తీరు ప్రభుత్వ ఆశయాలకు గొడ్డలిపెట్టులా మారిందని అంటున్నారు. షాపింగ్ మాల్స్ కు, కార్పొరేట్ సంస్థలకు 24 గంటలు వ్యాపారం చేసుకునేలా అనుమతులు ఇస్తూ.. చిరు వ్యాపారులను అక్రమంగా జైలుకు పంపడం అన్యాయమని అంటున్నారు.