- బీసీ రిజర్వేషన్లపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) విస్తరణకు ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆర్ఎఫ్‌సీఎల్‌లో తయారయ్యే యూరియాను తెలంగాణకే ప్రత్యేకంగా కేటాయించడం లేదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుత వానాకాలం సీజన్‌కు కావాల్సిన యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
421 ఆయుష్ కేంద్రాలు పూర్తిస్థాయిలో సేవలు..
తెలంగాణలో మంజూరైన 421 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆయుష్) కేంద్రాలు అన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2021 నుంచి 2025 వరకు ఈ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో 1.30 కోట్ల మందికి వైద్య సేవలు అందినట్లు తెలిపారు.
అలాగే హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్‌లో అరుదైన వైద్య గ్రంథాలు, పాత పత్రాలతో డిజిటల్ డిపాజిటరీ అందుబాటులో ఉందన్నారు. సాంప్రదాయ వైద్య విధానాలపై అవగాహన పెంచేందుకు ఐఈసీ పథకం కింద గత ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి..
బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పుడు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1996, 2008, 2010, 2014లో ఏపీ, తెలంగాణ అసెంబ్లీలు బీసీ రాజకీయ రిజర్వేషన్లపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం రాయితీ కాదని, అది రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. దేశ జనాభాలో బీసీలు సుమారు 56 శాతం ఉన్నా, పార్లమెంట్‌లో వారికి కనీసం 14 శాతం ప్రాతినిధ్యం కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు.
