- జూన్ క్వార్టర్లో రూ.52,456 కోట్ల రెవెన్యూపై రూ.3,446 కోట్ల నికర లాభం
- ముడిసరుకుల ధరలు పెరగడంతో ఖర్చులు పైకి
- డిమాండ్ మాత్రం ఫుల్.. 6,82,724 బండ్ల అమ్మకం
- ఆగస్టు నుంచి రూ.30 వేల వరకు ధరల పెంపు
- రూ.561 కోట్లతో 4 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు
న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా జూన్ క్వార్టర్ (తాజా క్వార్టర్) ఫలితాలు నిరాశపరిచాయి. రెవెన్యూ 36 శాతం పెరిగినా నికర లాభం మాత్రం ఏడాది లెక్కన 9 శాతం, క్వార్టర్ ప్రాతిపదికన 6 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్(తాజా క్వార్టర్)లో రూ. 3,446 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.3,792 కోట్లతో పోలిస్తే ఇది 9.1 శాతం తక్కువ. ముడిసరుకుల ధరలు పెరగడంతో రెవెన్యూ కంటే ఖర్చులు వేగంగా పెరిగాయని, ఫలితంగా లాభాలు పడిపోయాయని కంపెనీ చెబుతోంది.
కంపెనీ రెవెన్యూ తాజా క్వార్టర్లో ఏడాది లెక్కన రూ.38,605 కోట్ల నుంచి 36శాతం పెరిగి రూ.52,456 కోట్లకు చేరుకుంది. అదే ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.52,462.5 కోట్లతో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది. మారుతి మొత్తం ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. మొదటి క్వార్టర్లో రూ.50 వేల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది ఏకంగా 40.5 శాతం పెరుగుదల. ఇందులో ముడిసరుకుల ధరలే 45.9 శాతం పెరిగి రూ.32,013 కోట్లకు చేరాయి.
ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు 20.3 శాతం, ఇతర ఖర్చులు 17.7 శాతం పెరిగాయి. ఇబిటా జూన్ క్వార్టర్లో రూ.4,313 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్ మాత్రం ఏడాది లెక్కన 11.6 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది. దీనిని బట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్స్‌పై ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఈనెల నుంచి ధరలను రూ.30 వేల వరకు ధరలు పెంచుతామని తెలిపింది.
అమ్మకాల్లో జోరు
లాభాలు తగ్గినప్పటికీ, కార్ల అమ్మకాల పరంగా మారుతి సరికొత్త రికార్డు సృష్టించింది. తాజా క్వార్టర్లో మొత్తం 6,82,724 వాహనాలను విక్రయించింది. కిందటేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే 29శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం. దేశీయంగా మారుతి మార్కెట్ షేర్ 2.3శాతం పెరిగి 41.2శాతానికి చేరింది. కార్ల అమ్మకాల్లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ విక్రయాలు ఏకంగా 45శాతం, ఎగుమతులు 29శాతం వృద్ధి చెందాయని మారుతి సుజుకీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
కొత్త ప్లాంట్‌తో పెరిగిన ఉత్పత్తి
హర్యానాలోని ఖార్ఖోడాలో కంపెనీ తన రెండో ప్లాంట్‌ను ప్రారంభించింది. దీంతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని, తద్వారా కస్టమర్ల డిమాండ్‌ను వేగంగా తీర్చగలిగామని మారుతి తెలిపింది. డీలర్ల వద్ద సరుకు నిల్వలు 13 రోజులకు సరిపడా ఉన్నాయని, నిల్వలను సరైన స్థాయిలో నిర్వహిస్తున్నామని పేర్కొంది.
కంపెనీ గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. మొదటి దశలో భాగంగా రూ.561 కోట్ల బడ్జెట్‌తో 4 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించనుంది. కేవలం ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలపైనే కాకుండా.. హైబ్రిడ్, సీఎన్‌జీ, బయో గ్యాస్ వంటి ఇంధనాలతో నడిచే బండ్లను కూడా కంపెనీ తీసుకొస్తోంది.
