డ్రాపౌట్లను మళ్లీ చదువు వైపు మళ్లించాలి..ఓపెన్ స్కూల్స్లో చేర్పించి ప్రోత్సహించాలి: యోగితారాణా  

డ్రాపౌట్లను మళ్లీ చదువు వైపు మళ్లించాలి..ఓపెన్ స్కూల్స్లో చేర్పించి ప్రోత్సహించాలి: యోగితారాణా  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బడి మానేసిన పిల్లలను, పరీక్షల్లో ఫెయిలైన వారిని గుర్తించి మళ్లీ చదువు వైపు మళ్లించాలని అధికారులను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఆదేశించారు. అలాంటి వారందరినీ ఓపెన్ స్కూల్స్ లో చేర్పించి ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తి చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, అడల్ట్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష, సెర్ప్, మెప్మా తదితర విభాగాలతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో యోగితారాణా మాట్లాడుతూ.. వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే చదువుకు దూరమైన వారిని గుర్తించడం సాధ్యమవుతుందని  తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదువు రాని వారిని గుర్తించి ఉల్లాస్ ప్రోగ్రామ్ కింద అక్షరాస్యులుగా మార్చాలని పిలుపునిచ్చారు. ఓపెన్ స్కూల్స్, ఉల్లాస్ కార్యక్రమాలకు అర్హులైన వారిని గుర్తించడంలో సెర్ప్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కోరారు.

క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరిచి అడ్మిషన్లు పెంచేలా చూడాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. స్కూళ్లలోని పార్ట్ టైమ్ ఇన్ స్ట్రక్టర్లకు వృత్తి విద్యా సిలబస్‌‌‌‌పై అవగాహన కల్పించి, విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేలా చూడాలన్నారు. ఓపెన్ స్కూల్స్ ఆన్‌‌‌‌లైన్ అడ్మిషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది అడ్మిషన్ల లక్ష్యాలను చేరుకున్న తీరును టాస్ డైరెక్టర్ లింగయ్య, మాజీ డైరెక్టర్ పీవీ శ్రీహరి వివరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పి. రాజీవ్, అల్కా సింగ్, గీతా వంగలూరి, సునీత తదితరులు పాల్గొన్నారు.