గ్యాస్ షార్టేజీతో IRCTC అలర్ట్.. ఇండక్షన్ పొయ్యిలపై వంటలకు ఆదేశం

గ్యాస్ షార్టేజీతో IRCTC అలర్ట్.. ఇండక్షన్ పొయ్యిలపై వంటలకు ఆదేశం

మిడిల్ ఈస్ట్ యుద్ధం ముదురుతున్న కారణంగా అంతర్జాతీయంగా ఎల్‌పీజీ సప్లై వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ దిగుమతులు తగ్గడంతో భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్టాక్ సరిపడా ఉందని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంక్షోభం రైల్వే ప్రయాణికుల ఆహార సౌకర్యాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు IRCTC సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలోని క్యాంటీన్లు, ఫుడ్ ప్లాజాలు, జన్ ఆహార్ కేంద్రాలకు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.

మార్చి 10, 2026న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఐఆర్‌సీటీసీ వెస్ట్ జోన్ యూనిట్లను ఆదేశించింది. ఇకపై రైల్వే క్యాంటీన్లలో గ్యాస్ పొయ్యిలకు బదులుగా ఇండక్షన్ కుక్కర్లు, మైక్రోవేవ్ ఓవెన్లను వాడాలని సూచించింది. గ్యాస్ సరఫరా నిలిచిపోయినా.. వంట గదులు ఆగకుండా ఉండేందుకు ఈ విద్యుత్ పరికరాలు కీలకమని రైల్వే శాఖ భావిస్తోంది.

ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా 'రెడీ టూ ఈట్' ఫుడ్ ఐటమ్స్‌ను తగినంత స్టాక్ ఉంచుకోవాలని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. రైలు ప్రయాణంలో ప్రయాణికులకు నిరంతరాయంగా భోజన సదుపాయం అందడమే తమ ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం.. దిగుమతులు తగ్గడంతో వాణిజ్య అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ల లభ్యత కష్టతరంగా మారుతుండటమే ఈ మార్పులకు ప్రధాన కారణం.

ఈ గ్యాస్ సంక్షోభం వల్ల ఆహార నాణ్యత తగ్గకుండా.. ధరలు పెరగకుండా రైల్వే అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వెస్ట్ ఆసియాలో యుద్ధం సద్దుమణిగే వరకు ఈ ప్రత్యామ్నాయ వంట పద్ధతులు కొనసాగే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా స్టేషన్లలోని క్యాంటీన్లు మూతపడకుండా, ప్రయాణికులకు వేడివేడి ఆహారాన్ని అందించేందుకు రైల్వే శాఖ చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ పరిస్థితుల స్థాయిని తెలియజేస్తోంది.