ఖమ్మం రూరల్, వెలుగు: రాష్ట్రంలోనే ఏదులాపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచే మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏదులాపురం మున్సిపల్ కౌన్సిలర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మొదటి విడతలో రూ.100 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నామని, రెండో విడతలో మరో రూ.100 కోట్లతో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ భూముల సర్వే అనంతరం అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, అవసరమైన చోట స్మశానవాటికలు, ఆధునిక బస్సు షెల్టర్లు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.
