వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

మెదక్, వెలుగు: వృద్ధురాలి హత్య కేసులో నిందితులైన ఇద్దరికి మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా  న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని ఉప్పుగూడకు చెందిన కీరాజీ (36), చంద్రకళ (34) సహజీవనం చేస్తూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు చంద్రకళ తల్లి రాధ వద్ద ఉన్న నగదును తీసుకునేందుకు ఆమెను హత్య చేయాలని పథకం వేసుకున్నారు. 2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌11న రాధకు మద్యం తాగించి, కీరాజీ నడుపుతున్న ఆటోలో తీసుకెళ్లారు.

కీరాజీకి పరిచయమున్న లక్కీ, సలీంలను కూడా తమతో కలుపుకుని ఉప్పుగూడ నుంచి బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి మీదుగా మెదక్ జిల్లాలోని మనోహరాబాద్‌‌‌‌‌‌‌‌వైపు వెళ్లి, హైవే పక్కన ఆటోను నిలిపి రాధను సమీపంలోని ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఉప్పుగూడలో ఉన్న రాధ నివాసానికి వెళ్లి ఆమె దాచిన రూ.4 లక్షల నగదును నిందితులు తీసుకెళ్లారు.

ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ఛార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువు కావడంతో మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. నీలిమ నిందితులు కీరాజీ, చంద్రకళకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. 7 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు.