వనపర్తి, వెలుగు: ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తుంటే, కొందరు డాక్టర్లు తమ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఖిల్లా గణపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఎక్స్ రే యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
డాక్టర్లు విధులకు రాకపోయినా హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక కారణాల వల్ల జాప్యమైన వనపర్తి-పెద్దమందడి ప్రధాన రహదారి రూ.40 కోట్ల నిర్మాణ పనులను మరో వారంలో ప్రారంభిస్తామని తెలిపారు.
యూరియా బుకింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో విద్యుత్ రంగానికి పెద్దపీట వేస్తున్నామని, నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
