నన్ను తిట్టిన వాళ్లను క్షమిద్దాం..సెల్ఫీ వీడియోలో ప్రధాని మోదీ

నన్ను తిట్టిన  వాళ్లను క్షమిద్దాం..సెల్ఫీ వీడియోలో ప్రధాని మోదీ
  • నా తల్లిని అనుచితంగా తిట్టడం బాధించింది..
  • సమస్యలకు తిట్లు పరిష్కారం చూపవని వ్యాఖ్య

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో తనను, తన తల్లిని తిట్టిన విద్యార్థులను క్షమించాలని అనుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు వాడిన అనుచిత పదాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు తిట్లు పరిష్కారం కాదని తెలిపారు. బూతులు తిట్టిన విద్యార్థులకు శిక్షలు విధించడం, వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. 

చిన్నతనంలో పిల్లలు తప్పులు చేయడం సాధారణమేనని, తప్పులు దిద్దుకునే అవకాశం వారికి ఇవ్వాలని అన్నారు. దారి తప్పిన పిల్లలు తప్పు చేస్తే శిక్షించడం కన్నా వారిని క్షమించి సరైన మార్గదర్శనం చేయడం మన విధి అని అన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం రాత్రి ఎక్స్ లో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రధాని మోదీ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. 

‘కొన్నిసార్లు పొరపాటున మన దంతాలతో మన నాలుకనే కొరుక్కుంటాం. రక్తం కూడా వస్తుంది. అంతమాత్రాన మన పళ్లను విరగొట్టుకోలేం. ఎలాగైతే పళ్లు, నాలుక  మనవో.. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన చేసిన పిల్లలు, నన్ను తిట్టిన వారంతా మనవారే. పిల్లలు తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం వారికి కల్పించాల్సిన సమయమే బాల్యం. వారిని క్షమించాలని నేను తీసుకున్న  నిర్ణయాన్ని సమాజం అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

కొందరు విద్యార్థులు పెడదారి పట్టారు. వారికి మార్గనిర్దేశం చేయడం మన బాధ్యత. వారిని శిక్షించడం.. కోర్టుల చుట్టూ తిప్పడం, సామాజిక వేధింపులకు గురిచేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. విద్యార్థులు దేశంతో కలిసి ముందుకు సాగాలని ఆహ్వానిస్తున్నాను. రండి.. దేశం కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం. మన తప్పుల నుంచి నేర్చుకుంటూ మన కలలను సాధించుకుందాం. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మీలో ప్రతి ఒక్కరూ పురోగతి సాధించాలని నేను కోరుకుంటున్నాను. కలిసి పనిచేద్దాం. భారత్ కోసం పనిచేద్దాం’ అని మోదీ పేర్కొన్నారు.