గ్లాస్గో: కామన్వెల్త్‌లో ఇండియా బాక్సర్ల పంచ్ అదురుతోంది. శుక్రవారం జరిగిన 54 కేజీల సెమీస్ బౌట్‌లో ప్రీతి పవార్ 5–0తో కాథరిన్ ఎంవాపె (జాంబియా)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. భివానీకి చెందిన 22 ఏళ్ల ప్రీతి బౌట్ ఆరంభం నుంచే జాంబియా బాక్సర్‌పై లెఫ్ట్ పంచ్‌లతో విరుచుకుపడింది. తొలి రెండు రౌండ్లలో ప్రత్యర్థికి మూడుసార్లు ఎయిట్ కౌంట్ పడగా, ఐదుగురు జడ్జిలు ప్రీతికి అనుకూలంగా 10–8 పాయింట్లు కేటాయించారు. 80 కేజీ బౌట్‌లో అంకుశ్ పంగాల్ 5–0తో జోషువా ఒఫోరిని చిత్తు చేశాడు.
తొలి రెండు రౌండ్లలోనే పదునైన పంచ్‌లు విసిరిన అంకుశ్ ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. విమెన్స్ 70 కేజీ సెమీస్‌లో అరుంధతి చౌదరి 4–0తో డిఫెండింగ్ చాంపియన్ రోసి ఎక్లెస్ (వేల్స్)పై, 57 కేజీల్లో జాస్మిన్ లాంబోరియా ఆర్‌ఎస్‌సీ ద్వారా రాపెలాంగ్ మాసెలేలాపై, మెన్స్ 55 కేజీల్లో జాదుమణి సింగ్ 5–0తో ఫిలిప్ పుములో (నమీబియా)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్ 4X 400 మీటర్ల రిలేలో ఇండియా టీమ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
క్వాలిఫయింగ్ హీట్–2లో విశాల్ టీకే–అనిసా బాబు–రాజేష్ రమేశ్–రష్‌దీప్ కౌర్‌తో కూడిన ఇండియా బృందం 3:20.98 సెకన్లతో రేసును ముగించి నాలుగో ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా ఏడో స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
