హైదరాబాద్ : రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేర‌కే ఫెన్సింగ్‌..సర్వే నంబర్ 60లోకి అస్సలు వెళ్లలేదు

హైదరాబాద్ : రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేర‌కే  ఫెన్సింగ్‌..సర్వే నంబర్ 60లోకి అస్సలు వెళ్లలేదు
  •     కోర్టు ఆదేశాల నేపథ్యంలో హైడ్రా ప్రకటన  

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని స‌ర్వే నంబ‌రు 59 లో ఉన్న ప్రభుత్వ భూమిని  రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి, స‌మాచారం మేర‌కే ఫెన్షింగ్ వేశామని హైడ్రా శుక్రవారం ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొంది. రెవెన్యూ అధికారులు నిర్దేశించిన హ‌ద్దుల మేర‌కే స‌ర్వే నంబ‌రు59లోని దాదాపు 19 ఎక‌రాల‌ను కాపాడుతూ ఫెన్సింగ్ వేసిన‌ట్టు పేర్కొంది. ఆర్‌డీవో, ఎం ఆర్ వో, స‌ర్వేయ‌ర్లు, ఆర్ ఐల స‌మ‌క్షంలో పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఫెన్సింగ్ వేశామన్నారు. స‌ర్వే నంబ‌రు 59లో ప్లాస్టిక్‌, చెత్త వేసి ప‌రిస‌రాల‌ను అప‌రిశుభ్రం చేస్తున్న తాత్కాలిక షెడ్డును కూడా తొల‌గించామంది. 

స‌ర్వే నంబ‌రు 60లోకి హైడ్రా వెళ్లలేద‌ని, సర్వే నెంబర్ 60లోని త‌న‌కు చెందిన 350 గ‌జాల ప్లాట్‌లోని ప్రహ‌రీని హైడ్రా, రెవెన్యూ అధికారులు కూల్చారంటూ  సుధారాణి కోర్టును ఆశ్రయించిన నేప‌థ్యంలో విచారణకు సంబంధించిన అంశాపై  శుక్రవారం హైడ్రా  ఈ వివ‌ర‌ణ ఇచ్చింది. స‌ర్వే నంబ‌రు 60లో త‌న ప్లాట్ ఉంద‌ని ఆక్రమ‌ణ‌లు తొల‌గించిన త‌ర్వాత కానీ అంత‌కు ముందు   సుధారాణి అనే మ‌హిళ హైడ్రాను సంప్రదించ‌లేని,  హైడ్రాకు ఫిర్యాదు కూడా చేయ‌లేదరని పేర్కొంది. రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో వారు చూపించిన హ‌ద్దుల మేర‌కే హైడ్రా ఫెన్సింగ్ వేసింద‌ని,  ఇందులో హైడ్రా  సొంత నిర్ణయాలు తీసుకోలేద‌ని స్పష్టం చేసింది.