జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై నెలకొన్న వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాగంటి మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. లేటెస్టుగా గోపీనాథ్ మృతిపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆశ్రయించారు ఆయన తల్లి, కుమారుడు.
2025 నవంబర్ 08వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గోపీనాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి (92). మృతి వెనుక ఉన్న కారణాలేంటో .. ఆయనను కేర్ తీసుకోవాల్సిన వాళ్ల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కొడుకు మృతి వెనక నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవడం, మరేదో ఉద్దేశం ఉన్నట్లు అనుమానంగా ఉందని ఆమె ఫిర్యాదు చేశారు.
అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్స్ లో చేరాడని.. 2025 జూన్ 8న గోపీనాథ్ చనిపోయినట్లు ఆస్పత్రి ప్రకటించింది. అంతకు ముందే చనిపోయి ఉంటే ఆలస్యంగా ప్రకటించినట్లు తెలుస్తోందని ఆమె పేర్కొన్నారు. తమకు చివరి చూపుకు కూడా నోచుకుండా చేశారని ఆరోపించారు.
నా కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారు. ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలి అని ఆమె శనివారం (నవంబర్ 08) ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో గోపీనాథ్ మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తనకు లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈ క్రమంలో మాగంటి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
