కొత్త చరిత్ర సృష్టించిన గోల్డ్.. 24 గంటల్లో ఆల్ టైం హైకి చేరిన బంగారం.. ఎందుకంటే..?

కొత్త చరిత్ర సృష్టించిన గోల్డ్.. 24 గంటల్లో ఆల్ టైం హైకి చేరిన బంగారం.. ఎందుకంటే..?

కేవలం 24 గంటల సమయంలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. మునుపెన్నడూ లేని విధంగా ఔన్సు బంగారం ధర ఏకంగా 4,500 డాలర్ల మార్కును తాకి కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే బంగారం కొని పెట్టుకున్న ఇన్వెస్టర్లకు ఇది పండగ లాంటి వార్తే అయినప్పటికీ.. పెళ్లిళ్లు లేదా ఇతర అవసరాల కోసం కొనాలనుకునే సామాన్యులకు మాత్రం ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. అసలు ఒక్క రోజులోనే బంగారం ధర ఇంతలా పెరగడానికి గల ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి రాకపోవడం మార్కెట్లలో అనిశ్చితిని కొనసాగిస్తోంది. దీనికి తోడు వెనిజులాలో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు కలగడం ప్రపంచ ఇంధన భద్రతపై ఆందోళనలను పెంచింది. అలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఐసిస్ కు వ్యతిరేకంగా అమెరికా సైనిక చర్యలు చేపడుతుందనే వార్తలు ఇన్వెస్టర్లలో భయాన్ని రేకెత్తించాయి. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని భావించే ఇన్వెస్టర్లు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' వచ్చే ఏడాది వడ్డీ రేట్లను రెండుసార్లు తగ్గించవచ్చనే వార్తలు మార్కెట్‌లో బలంగా వినిపిస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, నిరుద్యోగిత సంకేతాలు కనిపించడంతో వడ్డీ రేట్లు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంక్ డిపాజిట్లు, బాండ్ల ద్వారా వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇన్వెస్టర్లు తమ దృష్టిని బంగారం వైపు మళ్లిస్తుంటారు. ఇది సహజంగానే ధరల పెరుగుదలకు దారితీస్తుంది.

కేవలం సాధారణ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా తమ గోల్డ్ రిజర్వ్స్ పటిష్టం చేసుకోవడానికి భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు బంగారం ధరలు 70 శాతం మేర పెరగగా.. ఇది 1979 తర్వాత నమోదైన అత్యంత బలమైన వార్షిక వృద్ధి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.

ALSO READ : బెంగళూరు దేశ రాజధాని కావాలి..

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గేవరకు, ఆర్థిక అనిశ్చితి కొనసాగినంత కాలం బంగారం ధరలు తగ్గే సూచనలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులకు ఇది భారం అయినప్పటికీ, పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం తన విలువను ఎప్పుడూ కాపాడుకుంటుందని తాజా పెరుగుదల మరోసారి నిరూపించింది.