IND vs PAK: భారత్–పాక్ మ్యాచ్ చూసేందుకు కొలంబోకు పీసీబీ చైర్మన్ ..

IND vs PAK: భారత్–పాక్ మ్యాచ్ చూసేందుకు కొలంబోకు పీసీబీ చైర్మన్ ..

IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15) కొలంబోలో జరగనున్న భారత్–పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కొలంబోకు వెళ్లనున్నారు. మ్యాచ్‌ను వీక్షించడంతో పాటు ఐసీసీ అధికారులతో కూడా చర్చలు జరపడమే ఈ పర్యటనలో ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. గ్రూప్–ఏ మ్యాచ్‌ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ పోరుకు PCBకి చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా నఖ్వీతో పాటు శ్రీలంకకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. పాక్ సూపర్ లీగ్ సీఈఓ సల్మాన్ నసీర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ ఈ బృందంలో ఉన్నారు. ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు ఇతర అధికారులతో నఖ్వీ సమావేశం అయ్యే ఛాన్స్ ఉందని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ఆదేశాలు ఇవ్వడంతో ఐసీసీ– పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో భారత్‌కు రావడానికి నిరాకరించడంతో, ఢాకాకు మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి ఐసీసీ తీసుకుంది. దీంతో ఐసీసీ– పీసీబీ– బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య పలు దఫాల్లో జరిగిన చర్చల అనంతరం పాకిస్థాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. కొలంబోలో ఐసీసీ చైర్మన్‌తో పాటు భారత్– బంగ్లాదేశ్ బోర్డుల ఉన్నతాధికారులతో పీసీబీ చైర్మన్ నఖ్వీ అనధికారిక సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

కొలంబో వెళ్లే ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నక్వీ శుక్రవారం ఆ దేశ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్‌ను కలిశారు. ప్రస్తుత క్రికెట్ పరిస్థితులు, ఐసీసీతో పాక్ సంబంధాలపై ఇద్దరూ సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధాని అనుమతి లభించడంతోనే నఖ్వీ ఈ పర్యటనకు సిద్ధమయ్యారని పీసీబీ వర్గాలు తెలిపాయి. దీంతో భారత్– పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు ఐసీసీతో సంబంధాలు మెరుగుపర్చుకోవడం కోసం పీసీబీ చైర్మన్ కి ఈ పర్యటన కీలకంగా మారనుందని భావిస్తున్నారు.