వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతోన్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ భారీ కుట్ర చేసిందని ది వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. నాటో సదస్సు కోసం ట్రంప్ టర్కీ వెళ్లిన సమయంలో ఇరాన్ ఈ కుట్రకు తెరలేపిందని నివేదించింది. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో ట్రంప్ రహస్య మార్గంలో టర్కీ నుంచి ఎస్కేప్ అయినట్లు తెలిపింది. ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేసిందన్న వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకంపనలు రేపుతోంది. ఈ కథనంపై అటు అమెరికా గానీ, ఇటు ఇరాన్ గానీ అధికారికంగా స్పందించలేదు.
టర్కీ రాజధాని అంకారా వేదికగా 2026, జూలై 7, 8 తేదీలలో నాటో కూటమి సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ క్రమంలో తమ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా టర్కీలో ట్రంప్‌ను అంతమొందించాలని ఇరాన్ కుట్ర చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో ట్రంప్ రిటర్న్ జర్నీ ప్రణాళికలను అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ పూర్తిగా మార్చేసింది.
సాధారణంగా ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ నుంచి అధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ మాస్టర్ ప్లాన్ వేసింది. తిరుగు ప్రయాణం కోసం ఎప్పటి మాదిరిగానే ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కారు.
ఆ వెంటనే ఎయిర్‌పోర్ట్ ఫుడ్/క్యాటరింగ్ ట్రక్కు ద్వారా రహస్యంగా కిందకు దిగారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ సి-32ఏ అనే చిన్న సైనిక విమానం ద్వారా బ్రిటన్‌కు వెళ్లారు. అటు నుంచి ఆయన అమెరికాకు వెళ్లినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఈ ఆపరేషన్ చాలా పకడ్భందీగా, అత్యంత గోప్యంగా సాగింది. చివరి వరకు వైట్ హౌస్ సిబ్బందికి కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.
