వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఫార్మాట్‌లో మార్పులు.. ఐసీసీపై స్కాట్లాండ్‌‌, నెదర్లాండ్స్‌‌ క్రికెట్‌‌ బోర్డుల ఆగ్రహం

వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఫార్మాట్‌లో మార్పులు.. ఐసీసీపై స్కాట్లాండ్‌‌, నెదర్లాండ్స్‌‌ క్రికెట్‌‌ బోర్డుల ఆగ్రహం

దుబాయ్‌‌: 2027 వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఫార్మాట్‌‌లో ఐసీసీ చేసిన మార్పులపై క్రికెట్‌‌ స్కాట్లాండ్‌‌, రాయల్‌‌ డచ్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (కేఎన్‌‌సీబీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. టోర్నీ ప్రారంభానికి 18 నెలల కంటే తక్కువ సమయం ఉండగా కీలక మార్పులు చేయడం అంతర్జాతీయ క్రికెట్‌‌ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదముందని సోమవారం పేర్కొన్నాయి.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే 2027 వన్డే వరల్డ్‌‌కప్‌‌లో మొత్తం 14 దేశాలు పాల్గొననున్నాయి. అయితే 12, 13, 14 ర్యాంకుల్లో ఉండే మూడు జట్లు ముందుగా క్వాలిఫయింగ్‌‌ రౌండ్‌‌లో తలపడాల్సి ఉంటుంది. అందులో ఒక్క జట్టు మాత్రమే ముందుకెళ్లి మిగతా 11 జట్లతో ప్రధాన రౌండ్‌‌లో చేరుతుంది. 

అనంతరం 12 జట్లను ఆరేసి జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఈ మార్పులు అసోసియేట్‌‌ దేశాల క్రికెట్‌‌కు ఎదురుదెబ్బగా మారుతాయని స్కాట్లాండ్‌‌, కేఎన్‌‌సీబీ పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా క్రికెట్‌‌ను మరింత విస్తరించాల్సిన సమయంలో ఎదుగుతున్న దేశాలకు అవకాశాలు తగ్గించడం సరైన సంకేతం కాదని అభిప్రాయపడ్డాయి.