న్యూఢిల్లీ: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఆటలోని నిరంతర దూకుడు సహచర ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ అన్నాడు. మైదానంలో కోహ్లీతో కలిసి ఉన్నప్పుడు మరో ఐదుగురు ప్లేయర్లు తమ పరిమితులను మించి కష్టపడేలా ప్రేరేపిస్తుందన్నాడు. ‘కోహ్లీ విషయంలో తీవ్రత అనేది రాజీపడలేని విషయం. పవర్‌ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్‌వికెట్ వద్ద అతని కదలికలు అమోఘం.
రిఫ్లెక్స్‌లు, డైవ్‌లు సూపర్‌గా ఉంటాయి. గత సిరీస్‌ల్లో కూడా అతను చాలాసార్లు డైవ్ చేశాడు. గ్రౌండ్‌లో ఎల్లప్పుడూ చురుకుగా కనిపిస్తాడు. దాని ప్రభావం ఇతరులపై పడేది. కెరీర్ చివరి దశలో కూడా డెత్ ఓవర్లలో ఇరువైపులా లాంగాన్ నుంచి లాంగాన్ వరకు ఆగకుండా పరుగెడతాడు. ఫీల్డర్లను విస్తరించినప్పుడు సర్కిల్ నుంచి బయటకు పరుగెత్తే తొలి ప్లేయర్ అతనే.
జట్టు కోసం అతను అలా చేయడం ఓ అద్భుతమైన విషయం. అయితే బంతి తనవరకు వచ్చే క్షణాలకే పరిమితం కాకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటాడు. బంతి తన దగ్గర లేనప్పుడు కూడా అది తన చేతుల్లోనే ఉండాలని కోరుకుంటాడు. ఈ లక్షణమే అతన్ని ఫీల్డింగ్‌లో బెస్ట్‌గా నిలబెట్టింది’ అని దిలీప్ పేర్కొన్నాడు.
ప్రాక్టీస్‌కు, మ్యాచ్‌కు తేడా లేదు..
విరాట్ విషయంలో ప్రాక్టీస్ సెషన్, మ్యాచ్‌లోని ఆటకు పెద్ద తేడా ఏమీ ఉండదని దిలీప్ వెల్లడించాడు. ‘కోహ్లీ ఫీల్డ్‌లో ఉన్నాడంటే పక్కన మరో ఐదుగురు రెడీ కావాల్సిందే. వాళ్లు తమ పరిమితులకు మించి కష్టపడేలా చేస్తాడు. ప్లేయర్లపై అంతటి ప్రభావం చూపిస్తాడు. ప్రతి ఫీల్డర్ అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేయాలనే కోరికతో ఉండేలా ప్రోత్సహిస్తాడు’ అని దిలీప్ వివరించాడు.
బార్బడోస్‌లో జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తన పదవీ కాలంలోనే అత్యుత్తమ క్షణంగా దిలీప్ అభివర్ణించాడు. ‘నా అత్యుత్తమ క్షణం గురించి ఆలోచిస్తే, నాకు బార్బడోస్ 2024 గుర్తుకొస్తుంది. కేవలం ట్రోఫీ గెలవడమే కాదు, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న వాతావరణం, ఆ సంబురాలు మొదలవ్వడానికి ముందు కొన్ని క్షణాల పాటు ఉన్న నిశ్శబ్దం. ఆ నాలుగేళ్లలో ఆ కుర్రాళ్లు ఎంత కష్టపడ్డారో నేను గ్రహించగలిగాను.
ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికీ నా మనసులో నిలుపుకుంటాను’ అని దిలీప్ వ్యాఖ్యానించాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో చివరి ఓవర్‌లో డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో ముడిపడి ఉన్న భావోద్వేగాలను కూడా దిలీప్ గుర్తుచేసుకున్నాడు. ‘మొదట కొద్దిసేపు నేను శారీరకంగా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉన్నాను, ఎందుకంటే నా మనసులో లెక్కలు వేసుకుంటున్నాను.
సూర్య ఆ బంతిని సరిగ్గా పట్టుకున్నాడా, అతని కాళ్లు బౌండరీ రోప్ లోపలే ఉన్నాయా? బంతిని గాలిలోకి విసిరేసి మళ్లీ పట్టుకునేలోపు సమయం సరిపోయిందా? అని ఆలోచిస్తున్నాను. కానీ అది సరైన క్యాచ్ అని నిర్ధారణ అయిన తర్వాత ఒక్కసారిగా భావోద్వేగాలు ఉప్పొంగాయి. అయితే మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదన్న విషయం కూడా నా మనసులో మెదులుతూనే ఉంది’ అని అప్పటి క్షణాలను దిలీప్ వెల్లడించాడు.
ఆరోగ్యకరమైన పోటీ కోసమే..
తన పదవీకాలంలో ప్రవేశపెట్టిన ‘ఫీల్డింగ్ మెడల్’ గురించి దిలీప్ మాట్లాడుతూ.. ఇది ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడంలో సహాయపడిందని చెప్పాడు. ఇండియా, శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లిప్ పొజిషనింగ్‌లో ఉండే చిన్నపాటి వ్యత్యాసాలు కూడా కీలకమన్నాడు.
‘ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫీల్డర్ల మధ్య దూరం చాలా ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో స్లిప్ ప్రాంతానికి బంతి చాలా వేగంగా వస్తుంది. అప్పుడు పక్కలకు కదలడానికి తగినంత సమయం దొరకదు. స్పిన్నర్ల విషయానికొస్తే, అఫ్గానిస్తాన్ సిరీస్‌లో శుభ్‌మన్ వారిని ఎలా మోహరించాడో మనం చూశాం. ఎడమ వైపుకు వెళ్లే ఫైన్ ఎడ్జ్ (బ్యాట్ అంచుకు తగిలి వెళ్లే బంతి)ను అందుకోవడానికి కీపర్, స్లిప్ మధ్య ఎంత ఖాళీ ఉంచాలి, మనం ఎక్కడ నిలబడాలి అనేది ముఖ్యం. అలాగే బంతి వేగం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది’ అని దిలీప్ వివరించాడు.
