2027 ఫిబ్రవరిలో తొలి మహిళల చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ.. టైటిల్‌‌పై కన్నేసిన టీమిండియా

2027 ఫిబ్రవరిలో తొలి మహిళల చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ.. టైటిల్‌‌పై కన్నేసిన టీమిండియా

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌‌లో తొలిసారి నిర్వహించనున్న ఐసీసీ మహిళల చాంపియన్స్‌‌ ట్రోఫీపై భారత బ్యాటర్‌‌ జెమీమా రోడ్రిగ్స్‌‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శ్రీలంక వేదికగా 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో భాగమవడం ఎంతో ప్రత్యేకమని జెమీమా పేర్కొంది. 

 ‘మేం ఇప్పటికే ఒకసారి విజయాన్ని రుచి చూశాం. అగ్రస్థానంలో నిలవడం ఎలా ఉంటుందో తెలుసు. ఒక్కసారి ఆ విజయాన్ని ఆస్వాదిస్తే మళ్లీ మళ్లీ సాధించాలనే తపన పెరుగుతుంది. చాంపియన్స్‌‌ ట్రోఫీ కోసం జట్టు అదే లక్ష్యంతో సిద్ధమవుతోంది. టోర్నీ కొత్తదైనా మా మైండ్‌‌సెట్‌‌లో మార్పు ఉండదు. జట్టును గెలిపించడమే లక్ష్యం’ అని జెమీమా తెలిపింది.

చాంపియన్స్‌‌ ట్రోఫీకి ముందు ఈ ఏడాది డిసెంబర్‌‌లో భారత్‌‌.. దక్షిణాఫ్రికాలో మల్టీ ఫార్మాట్‌‌ సిరీస్‌‌ ఆడనుంది. ప్రపంచంలోని రెండు అగ్ర జట్ల మధ్య జరిగే ఈ సిరీస్‌‌ తమకు మంచి సవాల్‌‌గా నిలుస్తుందని జెమీమా పేర్కొంది.  

మరోవైపు ‘ది హండ్రెడ్‌‌–2026’లో సదరన్‌‌ బ్రేవ్‌‌కు ప్రాతినిధ్యం వహించిన జెమీమా రెండు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ది మ్యాచ్‌‌ అవార్డులతో జట్టు ప్లేఆఫ్స్‌‌కు చేరడంలో కీలకపాత్ర పోషించింది. అయితే హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ గాయంతో టోర్నీ నుంచి మధ్యలోనే తప్పుకుంది. త్వరలో జరిగే మహిళల ఆసియా కప్‌‌ నాటికి పూర్తి ఫిట్‌‌నెస్‌‌ సాధించడంపై ప్రస్తుతం ఆమె దృష్టి పెట్టింది.