- స్టేట్ వైడ్‌గా 307 టీమ్స్.. 24 వేల బడుల పరిశీలన
- అకడమిక్ ప్యానెల్ టీమ్స్‌కు మూడు విడతల్లో ట్రైనింగ్
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదువులు ఎట్ల సాగుతున్నయ్.. టీచింగ్ ఎట్లుంది.. పిల్లలు ఏం నేర్చుకుంటున్నరు.. బడుల్లో సౌకర్యాలు ఎట్లున్నయ్ అనే దానిపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడులను తనిఖీ చేసేందుకు అకడమిక్ ప్యానెల్ టీమ్స్‌ను రంగంలోకి దించుతోంది. ఈనెల 17 నుంచి ఈ టీమ్స్ బడులను తనిఖీ చేయనున్నాయి. విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) సామర్థ్యాలను పరిశీలించడంతో పాటు, టీచర్లకు అకడమిక్ సపోర్ట్ అందించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం.
రాష్ట్రంలో ఉన్న దాదాపు 24 వేల స్కూళ్లను తనిఖీ చేసేందుకు 307 ప్యానెల్ టీమ్స్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రైమరీ స్కూళ్ల కోసం 171, అప్పర్ ప్రైమరీకి 38, హైస్కూళ్లకు 98 టీమ్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూళ్లకు పదేండ్ల అనుభవం ఉన్న పీఎస్ హెచ్ఎం, ఎస్జీటీలు అధికారులుగా, హైస్కూల్, యూపీఎస్‌లకు స్కూల్ అసిస్టెంట్లు సభ్యులుగా ఉంటారు. ప్రైమరీ స్కూళ్ల తనిఖీ టీమ్స్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. హైస్కూల్ టీమ్‌లో హెచ్ఎం, సబ్జెక్ట్ టీచర్లు, పీఈటీ కలిపి తొమ్మిది మంది ఉంటారు.
మూడు నెలల్లో వంద బడులు..
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీమ్స్ రోజుకు రెండు స్కూళ్లను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో కనీసం 100 బడులను కవర్ చేయాలి. హైస్కూల్ టీమ్స్ రోజుకు ఒక స్కూల్‌ను పరిశీలించాలి. మూడు నెలల్లో సగటున 50 స్కూళ్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది.
మూడు విడతల్లో ట్రైనింగ్..
తనిఖీలకు ముందు టీమ్స్‌కు మూడు విడతల్లో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీలో ఈ శిక్షణ ప్రారంభం కానుంది. మొదటి విడత ఈనెల 11, 12 తేదీల్లో, రెండో విడత 17, 18 తేదీల్లో, మూడో విడత 19, 20 తేదీల్లో కొనసాగుతుంది. శిక్షణ పూర్తయిన వెంటనే టీమ్స్ బడుల్లో తనిఖీలు చేపట్టనున్నాయి. మొదటి విడత టీమ్స్ ఆగస్టు 17 నుంచి, రెండో విడత టీమ్స్ ఆగస్టు 21 నుంచి, మూడో విడత టీమ్స్ ఆగస్టు 24 నుంచి స్కూళ్లను సందర్శిస్తాయి. ఈ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం రూ.18.50 లక్షల బడ్జెట్ రిలీజ్ చేసింది. అధికారులు సకాలంలో శిక్షణకు హాజరయ్యేలా చూడాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ ఆదేశించారు.
టీచింగ్ నుంచి హెల్త్ చెకప్స్ వరకు..
ఈ బృందాలు కేవలం చదువును మాత్రమే కాకుండా స్కూల్ లోని సమగ్ర పరిస్థితులపై ఆరా తీస్తాయి. క్లాస్ రూమ్ లో బోధన తీరు, లెసన్ ప్లాన్స్, సిలబస్ పూర్తి చేయడం, విద్యార్థుల అటెండెన్స్ తో పాటు మౌలిక సదుపాయాలైన లైబ్రరీ, ల్యాబ్స్ నిర్వహణను పరిశీలిస్తాయి. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యత, శానిటైజేషన్, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు జరుగుతున్న హెల్త్ చెకప్ లపై కూడా ఈ బృందాలు నివేదికలు రూపొందిస్తాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యాబోధనలో ఏకరూపత రావడంతో పాటు లోపాలను సరిదిద్దే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
