వాషింగ్టన్: యుద్ధంలో తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ ఇటీవల ఇరాన్ చేసిన డిమాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. టెహ్రాన్ ప్రభుత్వమే అమెరికాకు భారీగా కాంపెన్సేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇరాన్ నష్టపరిహారం కోరడాన్ని ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా అంటూ ఆయన సెటైరికల్ గా కామెంట్ చేశారు. దీనికి బదులుగా తాము కూడా యుద్ధ కాంపెన్సేషన్ చెల్లించాలంటూ ఇరాన్‌కు బిల్లు పంపనున్నట్లు స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఇరాన్ ప్రోద్బలంతో జరిగిన దాడుల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ గుర్తుచేశారు. అక్టోబర్ 2000లో యెమెన్ పోర్టు వద్ద అమెరికా నేవీకి చెందిన 'యూఎస్ఎస్ కోల్' యుద్ధ నౌకపై జరిగిన బాంబు దాడిని ఆయన ప్రస్తావించారు.
ఆ దాడిలో 17 మంది నావికులు మృతి చెందగా, ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అలాగే జనరల్ సొలొమానీ నాయకత్వంలో జరిగిన వివిధ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, రోడ్డు పక్కన అమర్చిన బాంబుల వల్ల బలైన వారి కుటుంబాలకు ఇరాన్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 50 ఏళ్లలో ఇరాన్‌లో జరిగిన ప్రజా ఆందోళనల సమయంలో హత్యకు గురైన నిరసనకారులు, అలాగే గడచిన ఐదు నెలల యుద్ధంలో మరణించిన 52 వేల మందికి కూడా ఈ కాంపెన్సేషన్ వర్తిస్తుందని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్‌తో ఇకపై జరిగే ప్రతి శాంతి చర్చలోనూ ఈ కాంపెన్సేషన్ డిమాండ్‌ను ప్రముఖంగా ప్రస్తావించాలని తన ప్రతినిధి బృందాన్ని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై సైనిక దాడులు చేయడం కంటే ఆర్థిక ఆంక్షల ద్వారానే మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
