- కేసు నమోదు చేసిన పోలీసులు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు వసూలు చేసిన ఎంఈఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కె.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ముకీద్ అహ్మద్ అలియాస్ ముఖిద్ హైమద్ 2024 డిసెంబర్ 16న కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన అంకోలి గ్రామానికి చెందిన గుగ్గిల లావణ్యను పరిచయం చేసుకున్నాడు.
మహాత్మా జ్యోతిబా ఫూలే హాస్టల్‌లో వార్డెన్ లేదా ఇతర శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో లావణ్య రూ.45 వేలు ఇచ్చింది. ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు మరో ఏడుగురి వద్ద కూడా ఉద్యోగాల పేరుతో దాదాపు రూ.5.90 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.
