- సర్ పై ఎలా పనిచేశారు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా?
- పీసీసీ ఉపాధ్యక్షులతో విడివిడిగా భేటీలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ప్రశ్నల వర్షం
హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులైన గత ఆరు నెలల కాలంలో.. మీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు. సర్ ప్రక్రియలో మీ వంతు పాత్ర ఏంటి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా.. రాబోయే రోజుల్లో మీరు పార్టీ పరంగా ఏ స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారు.. అంటూ పార్టీ వైస్ ప్రెసిడెంట్లపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షులతో విడివిడిగా భేటీ అయ్యారు. గత ఆరు నెలల ప్రోగ్రెస్ రిపోర్టును సావంత్ పరిశీలించారు. ఎవరు ఏ స్థాయిలో పనిచేశారనే రిపోర్టును ఆయన తన వద్ద ఉంచుకొని, వారి పనితీరు ఆధారంగా వారికి పలు హెచ్చరికలు, సూచనలు, సలహాలు చేశారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి పనిచేయాలని, పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.
కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది
ఈ సందర్భంగా వారికి ఎదురవుతున్న ఇబ్బందులను సచిన్ సావంత్ అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయని పీసీసీ ఉపాధ్యక్షులు పలువురు ఏఐసీసీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటిపోయినా అసలైన కార్యకర్తలను నేతలు గుర్తించడం లేదని, దీంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సావంత్‌కు వివరించారు. ఇప్పటికైనా పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను పట్టించుకోకపోతే..రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని సచిన్ సావంత్ కు వివరించారు.
