న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఊహించని విధంగా తగ్గింది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో ఫిమేల్ఫోర్స్ పార్టిసిపేషన్రేట్( ఎఫ్‌ఎల్‌ఎఫ్‌పీఆర్) గణనీయంగా పడిపోయింది. ఈ రేటు 33.2 శాతానికి చేరింది. అంతకుముందు క్వార్టర్లో ఇది 34.7 శాతం ఉండగా, ఏడాది క్రితం 33.4 శాతంగా ఉంది. గ్రామాల్లో ఎఫ్‌ఎల్‌ఎఫ్‌పీఆర్ 39.2 శాతం నుంచి 37.2 శాతానికి పడిపోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం.
పట్టణాల్లో 25.4 శాతం నుంచి 25 శాతానికి స్వల్పంగా తగ్గింది. మహిళా కార్మికుల సంఖ్య తగ్గుదల మంచిదికాదని ఎకనమిస్టులు అంటున్నారు. పనిచేసే వయస్సు ఉన్న మొత్తం మహిళల జనాభాలో, ఎంత శాతం మంది ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారో ఎఫ్‌ఎల్‌ఎఫ్‌పీఆర్ తెలియజేస్తుంది.
ఉద్యోగాలు పెరిగినా..
పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత తగ్గి, ఉపాధి అవకాశాలు పెరిగినా కూడా మహిళా భాగస్వామ్యం పడిపోయింది. పట్టణ నిరుద్యోగిత రేటు క్రితం క్వార్టర్ లోని 9.1 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింది. ఇది 2025 జూన్ క్వార్టర్లో నమోదైన 8.9 శాతం కంటే తక్కువ. గ్రామాల్లో మహిళల నిరుద్యోగిత మాత్రం గత క్వార్టర్లో ఉన్న 4.1 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది.
ఉపాధి రంగాల స్వరూపంలో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ప్రజలు వ్యవసాయ రంగాన్ని వీడి ఇతర రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామీణ ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 55.8 శాతం నుంచి 52.9 శాతానికి పడిపోయింది. తయారీ రంగం వాటా 22.6 శాతం నుంచి 24.4 శాతానికి పెరిగింది.
పెరిగిన వేతన ఉద్యోగుల సంఖ్య
అన్ని ప్రాంతాల్లో నిలకడగా వేతనాలు పొందే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. గ్రామాల్లో వీళ్ల వాటా 15.5 శాతం నుంచి 16.1 శాతానికి పెరగగా, పట్టణాల్లో 48.9 శాతం నుంచి 49.3 శాతానికి పెరిగింది. గ్రామాల మహిళల్లో వేతన ఉద్యోగాలు చేసే వారి సంఖ్య 11.2 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది.
స్వయం ఉపాధి పొందే మహిళల వాటా 72.7 శాతం నుంచి 72 శాతానికి తగ్గింది. పట్టణాల్లో మహిళా కార్మికుల్లో వేతన ఉద్యోగుల వాటా గతంలో ఉన్న 54.2 శాతం నుంచి 54.8 శాతానికి పెరిగింది. పశ్చిమ ఆసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఎకానమీ తన వృద్ధి వేగాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
