ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ నెరవేరకుండానే.. ప్రతి నెలా 200 నుంచి 300 మంది కార్మికులు రిటైర్ అవుతున్నారని తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసంతృప్తితో ఉద్యోగ విరమణ పొందుతున్న కార్మికుల కోసం ప్రభుత్వం వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. విలీన కమిటీలో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించి, విధివిధానాల నివేదిక త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన వేతన సవరణ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
అనంతరం బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కొమురెల్లి రాజిరెడ్డి, నాయకులు సాయి రెడ్డి, బుద్ధ విశాల్, యాదయ్య, రామకృష్ణ, వినాయక్ రెడ్డి, సీవీ.రావు, పరశురాములు పాల్గొన్నారు.
