బెంగళూరు దేశ రాజధాని కావాలి.. యువతి కామెంట్లపై ఇంటర్నెట్‌లో రచ్చరచ్చ..

బెంగళూరు దేశ రాజధాని కావాలి.. యువతి కామెంట్లపై ఇంటర్నెట్‌లో రచ్చరచ్చ..

ఢిల్లీకి చెందిన సిమృద్ధి మఖిజా అనే యువతి చేసిన ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. భారతదేశ రాజధానిని ఢిల్లీ నుండి బెంగళూరుకు మార్చాలని ఆమె సూచించడం నెట్టింట వేడిని పుట్టించింది. ఇటీవల ఢిల్లీ నుండి బెంగళూరుకు మారిన సిమృద్ధి, తన అనుభవాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఎయిర్ పొల్యూషన్, భద్రత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఆమె వీడియోలో మాట్లాడారు.

వీడియోలో ఆమె ప్రధానంగా ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ గురించి ప్రస్తావించారు. బెంగళూరులో రెండు నెలల పాటు గడిపిన తర్వాత తన తల్లిదండ్రులను కలవడానికి ఢిల్లీకి వెళ్లినప్పుడు.. అక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించిందని వెల్లడించారు. ఢిల్లీ గాలిని ఒక "గ్యాస్ ఛాంబర్" తో పోల్చిన ఆమె.. అంతర్జాతీయ పర్యాటకులు వచ్చే దేశ రాజధానిలో ఇంత దారుణమైన పర్యావరణ పరిస్థితులు ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. అక్కడి కంటే తాను ప్రస్తుతం నివసిస్తున్న బెంగళూరు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని చెప్పారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @simridhimakhija

మహిళల భద్రత విషయంలో కూడా బెంగళూరు ఎంతో మెరుగ్గా ఉందని వివరించారు. రాత్రి 10 గంటల సమయంలో కూడా బెంగళూరు వీధుల్లో ఒంటరిగా నడవడానికి తాను భయపడలేదని, అదే ఢిల్లీలో అయితే మహిళల రక్షణ గురించి ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన ఉంటుందని వాపోయారు. అలాగే బెంగళూరులోని రోడ్లు, పబ్లిక్ స్పేస్‌లు నడిచే వారికి అనుకూలంగా ఉన్నాయని, మౌలిక సదుపాయాల పరంగా బెంగళూరు రాజధానిగా ఉండటానికి అన్ని అర్హతలు కలిగి ఉందని నొక్కి చెప్పారు.

ALSO READ : జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్

అయితే ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తుండగా.. మరికొందరు బెంగళూరులోని సమస్యలను ఎత్తిచూపుతున్నారు. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్, నీటి ఎద్దడి వంటి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కేవలం వాతావరణం బాగున్నంత మాత్రాన రాజధానిని మార్చలేమని, దీని వెనుక చారిత్రక, రాజకీయ, పరిపాలనాపరమైన కారణాలు ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇండియన్ సిటీల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందనే అంశంపై చర్చకు తెరలేపింది ఈ వీడియో.